Share News

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:26 AM

పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు.

Parliament Sessions: తెలుగు భాషకు పట్టం

  • కిషన్‌రెడ్డి, సంజయ్‌ సహా మాతృభాషలో 17 మంది తెలుగు ఎంపీల ప్రమాణం

  • పంచెకట్టుతో హాజరైన కిషన్‌రెడ్డి

  • సంస్కృతంలో బాపట్ల ఎంపీ ప్రమాణం

న్యూఢిల్లీ/విజయనగరం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు. సోమవారం కొలువుదీరిన పార్లమెంటులో ప్రొటెం స్పీకర్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో ప్రమాణం చేయించారు. తొలుత ప్రధాని, కేంద్రమంత్రులు ఎంపీలుగా ప్రమాణం చేశారు.

అనంతరం వరుసక్రమాన్ని అనుసరించి అరుణాచల్‌ ప్రదేశ్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తొలిరోజు ప్రమాణం చేశారు. వీరిద్దరూ తెలుగులో ప్రమాణం చేశారు. వీరితోపాటు ఏపీకి చెందిన 15 మంది తెలుగులోనే ప్రమాణం చేశారు. వీరిలో రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, లక్ష్మీనారాయణ, కేశినేని శివనాథ్‌, బీకే పార్థసారథి, శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, గురుమూర్తి(వైసీపీ), భూపతిరాజు శ్రీనివాసవర్మ(బీజేపీ) పురందేశ్వరి(బీజేపీ), బాలశౌరి(జనసేన) ఉన్నారు.


ఇక గంటి హరీశ్‌, మాగుంట శ్రీనివాసులరెడ్డి, పుట్టా మహేశ్‌ యాదవ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం రమేశ్‌, మిథున్‌రెడ్డి(వైసీపీ), ఉదయ్‌ శ్రీనివా్‌స(జనసేన) ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణాప్రసాద్‌ సంస్కృతంలో, వైసీపీ ఎంపీ తనూజా రాణి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పంచెకట్టులో పార్లమెంటుకు హాజరై ఆకట్టుకున్నారు. విజయనగరం ఎంపీ, టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి పార్టీపై అభిమానం చాటుకున్నారు. వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు.

ఇక తెలంగాణకు చెందిన మిగతా 15 మంది ఎంపీలు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.కాగా ప్రమాణ స్వీకారం అనంతరం కిషన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘సికింద్రాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో, బీజేపీ ఆశీస్సులతో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయడం ఆనందాన్నిచ్చింది. వచ్చే ఐదేళ్లు చిత్తశుద్ధి, నిబద్ధతతో సికింద్రాబాద్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాను. ’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 04:27 AM