World Cup: మైదానంలోనే గొడవపడ్డ టీమిండియా కెప్టెన్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - Jan 21 , 2024 | 02:12 PM
అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. టీమిండియా అండర్19 జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్, బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు ఆటగాడు అరిఫుల్ ఇస్లాం మధ్య మాటల యుద్ధం నెలకొంది.
బ్లూమ్‌ఫోంటీన్: అండర్ 19 వన్డే ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. టీమిండియా అండర్19 జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్, బంగ్లాదేశ్ అండర్ 19 జట్టు ఆటగాడు అరిఫుల్ ఇస్లాం మధ్య మాటల యుద్ధం నెలకొంది. టీమిండియా ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత జట్టు 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ కలిసి మూడో వికెట్‌కు 116 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని త్వరగా విడదీయడంలో బంగ్లాదేశ్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ బౌలర్లు సహనం కోల్పోయారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ఫీల్డర్లలో ఒకరైన అరిఫుల్ ఇస్లాం.. ఉదయ్ సహారన్‌ను ఏదో అన్నారు.
దీంతో సహనం కోల్పోయిన ఉదయ్ సహారన్.. అరిఫుల్ ఇస్లాంతో వాగ్వాదానికి దిగాడు. మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ కూడా అక్కడికి వచ్చాడు. దీంతో ఉదయ్ సహారన్ బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లారు. బంగ్లాదేశ్ ఆటగాడి పైకి ఉదయ్ సహారన్ దూసుకెళ్లడం వీడియోలో కనిపించింది. ఇంతలోనే అంపైర్ జోక్యం చేసుకుని ఆటగాళ్లకు సర్ది చెప్పాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఉదయ్ సహారన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 64 పరుగులతో సత్తా చాటాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (64) అర్ధసెంచరీలతో మెరవగా, లెఫ్టామ్ స్పిన్నర్ సౌమీ పాండే నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ 84 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆదర్శ్, ఉదయ్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. తెలంగాణ క్రికెటర్ అవినాశ్ (23) వేగంగా ఆడాడు. మరూఫ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకు కుప్పకూలింది. షిహాబ్ (54), ఆరిఫుల్ (41) మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో గురువారం ఆడనుంది. ఇతర మ్యాచుల్లో అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్, స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ గెలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.