Share News

IND vs ENG:టీమిండియాపై చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆసీస్ ప్లేయర్ రికార్డును బద్దలుకొట్టి మరి..

ABN , Publish Date - Feb 23 , 2024 | 07:45 PM

టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన రూట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.

IND vs ENG:టీమిండియాపై చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆసీస్ ప్లేయర్ రికార్డును బద్దలుకొట్టి మరి..

రాంచీ: టీమిండియాతో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన రూట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టీమిండియా బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా త్వరగా పెవిలియన్‌కు వెళ్లిపోతుంటే రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్, స్పిన్నర్లు అశ్విన్, జడేజా దెబ్బకు లంచ్ బ్రేక్ సమయానికే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. దీంతో సెకండ్ సెషన్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అవడం ఖాయం అనిపించింది. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇంగ్లండ్ పాలిట జోరూట్ ఆపద్బాంధవుడి అవతారమెత్తాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇంగ్లండ్ వికెట్లకు అడ్డుగోడలా నిలబడ్డాడు. బెయిర్ స్టో, బెన్ ఫోక్స్, ఒల్లీ రాబిన్సన్‌తో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఇంగ్లండ్‌ను ఆలౌట్ కాకుండా రక్షించడంతోపాటు 302/7 పరుగుల మంచి స్థితిలో నిలిపాడు. ప్రస్తుతం క్రీజులో రూట్(106), రాబిన్సన్(31) ఉన్నారు.


టెస్టుల్లో రూట్‌కు ఇది 31వ సెంచరీ. భారత్‌పై 10వ సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే జోరూట్ చరిత్ర సృష్టించాడు. టెస్టు ఫార్మాట్ చరిత్రలో టీమిండియాపై 10 సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పేరు మీద ఉండేది. కానీ తాజాగా స్మిత్ రికార్డును బద్దలుకొట్టిన రూట్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. 52 ఇన్నింగ్స్‌ల్లో రూట్ 10 సెంచరీలు సాధించాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు చేసిన రూట్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 30 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు చేసిన గారీ సోబర్స్ మూడో స్థానంలో.. 41 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు చేసిన వీవీ రిచర్డ్స్ నాలుగో స్థానంలో.. 51 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు చేసిన రికీ పాంటింగ్ ఐదో స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో గతంలో 90 సార్లు ఈ మార్కు అందుకున్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్‌ను అధిగమించాడు. ప్రస్తుతం రూట్ 91 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 07:45 PM