Share News

Kapil Dev: కపిల్ దేవ్ రిటైర్ అయి 30 ఏళ్లయినా ఈ రికార్డులను కొట్టే మొనగాడే లేడు

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:17 PM

టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ శనివారం 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. శనివారంతో కపిల్ దేవ్ 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే కెప్టెన్‌గా, గొప్ప ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

Kapil Dev: కపిల్ దేవ్ రిటైర్ అయి 30 ఏళ్లయినా ఈ రికార్డులను కొట్టే మొనగాడే లేడు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ శనివారం 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. శనివారంతో కపిల్ దేవ్ 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే కెప్టెన్‌గా, గొప్ప ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కపిల్ దేవ్ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. గొప్ప పేస్ ఆల్ రౌండరైనా కపిల్ దేవ్ 687 వికెట్లు, 9 వేలకు పైగా పరుగులు చేశారు. 1978లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కపిల్ దేవ్ 1994 వరకు టీమిండియాకు ఎనలేని సేవల్ అందించారు. ఆ రోజుల్లో కపిల్ దేవ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేసేవారు. తన టెస్ట్ కెరీర్‌లో ఒకసారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కాలేదంటేనే కపిల్ ఫిట్‌నెస్ స్థాయి ఏ లెవల్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో కపిల్ దేవ్ ఎవరికీ సాధ్యా కానీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కపిల్ దేవ్ రిటైర్ అయి 3 దశాద్దాలు గడిచినప్పటికీ ఆయన సాధించిన పలు ప్రపంచ రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 30 ఏళ్లుగా ఆయన రికార్డులను కొట్టే మొనగాడే రాలేదు.


1. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో బౌలర్‌గా 400కు పైగా వికెట్లు తీయడమే గాకుండా, 5000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆల్‌రౌండర్‌గా కపిల్ దేవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మొత్తంగా 131 టెస్టు మ్యాచ్‌లాడిన కపిల్ దేవ్ 434 వికెట్లు తీశారు. ఇందులో 23 సార్లు 5 వికెట్ల హాల్ ఉంది. బ్యాటింగ్‌లో 31 సగటుతో 5248 పరుగులు చేశారు. ఇందులో 8 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి.

2. టెస్టు కెప్టెన్‌గా బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. టెస్టు కెప్టెన్‌గా బౌలింగ్‌లో కపిల్ దేవ్ 9 వికెట్లు పడగొట్టారు. 1983లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ 9 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో అప్పటికే కెప్టెన్‌గా 8 వికెట్లు పడగొట్టి టాప్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ రికార్డును కపిల్ దేవ్ బద్దలుకొట్టారు. ఇమ్రాన్ ఖాన్ 1982లో ఈ రికార్డు పడగొట్టారు. కాగా 1985లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ 8 వికెట్లు పడగొట్టారు.

3. ఒక టెస్ట్ సిరీస్‌లో 250కి పైగా పరుగులు చేసి, 30కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఆల్ రౌండర్‌గా కపిల్ దేవ్ ప్రపంచరికార్డు నెలకొల్పారు. 1979లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కపిల్ దేవ్ చెలరేగారు. 6 మ్యాచ్‌ల ఆ టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌లో 278 పరుగులు చేసిన కపిల్ దేవ్, బౌలింగ్‌లో 32 వికెట్లు తీశారు.

4. వన్డే క్రికెట్‌లో 9వ వికెట్‌కు రెండో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు కపిల్ దేవ్ పేరు మీదనే ఉంది. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్ కిర్మాణితో కలిసి కపిల్ దేవ్ ఈ రికార్డు నెలకొల్పారు. ఆ మ్యాచ్‌లో సయ్యద్ కిర్మాణి, కపిల్ దేవ్ కలిసి 9వ వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడారు. ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 175 పరుగులు చేశారు. దీంతో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెయిన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ కొట్టేవరకు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరు మీదనే ఉన్నది.

5. అలాగే వన్డే క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా కపిల్ దేవ్ చరిత్ర సృష్టించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 07 , 2024 | 12:20 PM