Share News

NEP vs NAM: చరిత్ర సృష్టించిన నమీబియా ఆటగాడు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే..

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:28 PM

నేపాల్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 11 ఫోర్లు, 8 సిక్సులతో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న జాన్ నికోల్ లాఫ్టీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

NEP vs NAM: చరిత్ర సృష్టించిన నమీబియా ఆటగాడు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే..

నేపాల్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 11 ఫోర్లు, 8 సిక్సులతో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న జాన్ నికోల్ లాఫ్టీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో గతంలో 34 బంతుల్లోనే సెంచరీ చేసిన నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా రికార్డును బద్దలుకొట్టాడు. 2023లో జరిగిన ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తాజాగా ఆ రికార్డును జాన్ నికోల్ లాఫ్టీ బ్రేక్ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ చేసిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ, సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన సుధేష్ విక్రమశేఖర ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.


ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 22 ఏళ్ల జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. జాన్ నికోల్ లాఫ్టీ క్రీజులోకి వచ్చే సమయానికి నమీబియా స్కోర్ 10.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62గా మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో 200 దాటింది. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న జాన్ నికోల్ లాఫ్టీ 101 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ మలన్ క్రుగర్ 48 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలిచింది. నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లు పడగొట్టాడు. జాన్ నికోల్ లాఫ్టీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 04:28 PM