Share News

Delhi: పీవీ సంస్కరణలతో దేశం ప్రగతి బాట..

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:13 AM

సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Delhi: పీవీ సంస్కరణలతో దేశం ప్రగతి బాట..

  • సీఎం రేవంత్‌

  • మాజీ ప్రధానికిఘనంగా నివాళి

  • సేవలను కొనియాడిన పలువురు నేతలు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేవంత్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి రెడ్డి కూడా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పీవీ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని దివంగత పి.వి నర్సింహారావు 103వ జయంతి వేడుకలు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి.


15.jpg

పి.వి చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు వి.హన్మంతరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో పీవీ చిత్రపటానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పీవీ జయంతి సందర్భంగా ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో పీవీ మార్గ్‌లోని ఆయన ఘాట్‌ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నివాళులర్పించి పీవీ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్సీ, పీవీతనయ సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీమంత్రి జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంత రావు, పీవీ నరసింహారావు కుటుంబసభ్యులు పీవీకి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన పీవీ నరసింహారావును దేశ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. పీవీ జయంతి శుక్రవారం తెలంగాణభవన్‌లో నిర్వహించారు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా కొనసాగిన పీవీ నరసింహారావు స్ఫూర్తి మరవలేనిదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రతిభకు చిరునామా పీవీ : ప్రధాని మోదీ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నాయకత్వం, ప్రతిభకు చిరునామాగా నిలిచిపోతారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు భారతరత్న ఇవ్వడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని మోదీ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పేర్కొన్నారు. మరోవైపు యూపీఏ ప్రభుత్వ హయాంలో కొనసాగిన వృద్ధిపై పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రభావాన్ని చూపాయని కాంగ్రెస్‌ పేర్కొంది. పీవీ ఆర్థిక సరళీకరణ విధానాలు దేశంలో నవ శకానికి నాంది పలికాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ పురోగతిలో పీవీపాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 04:13 AM