Share News

G.Kishan Reddy : ఎండగట్టండి

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:38 AM

రుణమాఫీ అమలులో కాంగ్రెస్‌ మోసం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్‌ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్‌..

G.Kishan Reddy : ఎండగట్టండి

  • గ్రామాల్లో రైతు రచ్చ బండ పెట్టండి

  • సర్కారును నిలదీస్తూ ఆందోళనలు చేయండి

  • పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ అమలులో కాంగ్రెస్‌ మోసం చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు డిక్లరేషన్‌ పేరుతో ఎన్నికల ముందు ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. రుణమాఫీ, రైతుభరోసా అమలులో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి

ఎనిమిది నెలలవుతున్నా ఎందుకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన ప్రాతిపదికపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యంపై గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రచ్చబండ తర్వాత సర్కారును నిలదీస్తూ ఆందోళనలు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 15న ప్రధాని మోదీ 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని, ఆ రోజున ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కిషన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.


సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేల్లో సూర్యనారాయణ గుప్తా మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 8,9 తేదీల్లో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 14వ తేదీ వరకు హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. సుష్మాస్వరాజ్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.


క్రిమినల్‌ చట్టాల్లో మరింత పారదర్శకత: బండి

కొత్త క్రిమినల్‌ చట్టాలు పోలీసులు మరింత పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేసేందుకు వీలు కల్పిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు. అరెస్టయిన వ్యక్తుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ఏఎ్‌సఐ స్థాయి వ్యక్తి ఉంటారని, జిల్లా బయట ఎవరినైనా అరెస్టు చేస్తే ఆ సమాచారం కూడా సంబంధిత పోలీసు అధికారికి చేరుతుందని మంగళవారం ఆయన లోక్‌ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు.

మానవ రవాణా విషయంలో భారతీయ న్యాయ సంహితలో కట్టుదిట్టమైన సెక్షన్లు చేర్చామని, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల విషయంలో ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకు కఠిన శిక్షలుంటాయని తెలిపారు.


గవర్నర్‌ను కలిసిన మహిళా మోర్చా

రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శిల్పారెడ్డి బృందం.. ఆయనకు వినతి పత్రం అందజేసింది.

Updated Date - Aug 07 , 2024 | 05:38 AM