Share News

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

ABN , Publish Date - Jun 18 , 2024 | 06:00 AM

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

  • తెలంగాణ విద్యుత్తు సంస్థలపై మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు

  • యూనిట్‌ ధర రూ.3.90 మాత్రమేనని లెక్కలు

  • ట్రాన్స్‌మిషన్‌, లైన్‌చార్జీలు కలిపి తడిసి మోపెడు!

  • యూనిట్‌కు రూ.5.64 ఖర్చు అయినట్లు అంచనా

  • విద్యుత్తు కారిడార్‌ బుకింగ్‌తో అదనపు నష్టం

  • బుకింగ్‌ను రద్దు చేసుకున్నందుకూ పరిహారం

  • విద్యుత్తు ఒప్పందానికి ఆమోదం తెలపని ఈఆర్సీ

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి. ఒప్పందం ప్రకారం యూనిట్‌ ధర రూ.3.90 మాత్రమేనని చెబుతున్నప్పటికీ.. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు తెలంగాణకు చేరేటప్పటికి అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నాయి. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఇప్పటివరకు 17,996 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.7,719 కోట్లు చెల్లించింది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు రూ.1,081 కోట్లు ఉన్నాయి. దీంతోపాటు ట్రాన్స్‌మిషన్‌, లైన్‌ చార్జీలు రూ.1,362 కోట్లు అయ్యాయి. ఇలా వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్‌కు ఖర్చు రూ.5.64 వరకు అవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. విద్యుత్తు కొనుగోలు చేసిన ధర కంటే చార్జీల రూపంలోనే రూ.3,110 కోట్ల అదనపు భారం పడినట్లయిందని గుర్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బకాయిల విషయంలోనూ రెండు

మిగతా 13వ పేజీలో...

రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. రూ.1081 కోట్ల బకాయిలున్నట్లు తెలంగాణ చెబుతుండగా.. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు సంస్థలు మాత్రం రూ.1715 కోట్ల బకాయిలున్నట్లు లెక్క చూపుతున్నాయి. ఈ బకాయిల వివాదంపై ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు కూడా చేసింది. వాస్తవానికి ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు ఏనాడూ సక్రమంగా సరఫరా కాలేదు. 2017 సంవత్సరం చివర్లో అందుబాటులోకి వచ్చిన ఈ విద్యుత్తు సరఫరా.. మొదలైనప్పటి నుంచీ అరకొరగానే జరిగింది. ఎన్నడూ వెయ్యి మెగావాట్లు సాఫీగా రాలేదు. ఇలా ఆశించిన సరఫరా లేకపోవడంతో తెలంగాణ డిస్కమ్‌లు తిరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయాల్సివచ్చింది. దాంతో 2017 నుంచి 2022 వరకు విద్యుత్తు సంస్థలపై అదనంగా రూ.2083 కోట్ల భారం పడింది. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

కారిడార్‌ బుకింగ్‌తో అదనపు నష్టం..

ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌)తో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు కారిడార్‌ను తెలంగాణ బుక్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారిడార్‌ కూడా విద్యుత్తు సంస్థలను మరింత రుణభారంలోకి నెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. బుకింగ్‌ ఒప్పందం ప్రకారం.. విద్యుత్తు తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు సరఫరా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన విద్యుత్తు సరఫరా నిలిచిపోయాక కూడా రూ.638 కోట్లను అదనపు చార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. వీటికితోడు గత ప్రభుత్వం కారిడార్ల బుకింగ్‌ విషయంలో చేసిన తప్పిదంతో మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు సరఫరాకు కేవలం వెయ్యి మెగావాట్ల కారిడార్‌ సరిపోతుండగా.. నాటి ప్రభుత్వం మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు కూడా అడ్వాన్సుగా కారిడార్‌ బుక్‌ చేసింది. అయితే.. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు లభించే అవకాశం లేదని ఈ కారిడార్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. కానీ, ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగింది. బుక్‌ చేసుకున్నందుకుగాను పరిహారం కింద రూ.261 కోట్లు చెల్లించాలని పీజీసీఐఎల్‌.. తెలంగాణ డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్‌ ఒప్పందంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదు. దీంతో.. ఈఆర్సీ ఆమోదం లేకుండా ఛత్తీ్‌సగఢ్‌కు చెల్లించిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 18 , 2024 | 06:03 AM