Share News

CM Revanth: ఫీజు ‌రీయింబర్స్‌మెంట్‌‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:44 PM

ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సాఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

CM Revanth: ఫీజు ‌రీయింబర్స్‌మెంట్‌‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
CM Revanth Reddy

హైదరాబాద్: ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్సాఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. పలు రకాల పరిస్థితుల్లో ప్రాధాన్యతలు మారి.. ఫీజు ‌రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు.

జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌పై ఈరోజు(శనివారం) ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఆన్ టైమ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.


ఇంజనీరింగ్ కాలేజీలు అలా చేయొద్దు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై త్రిముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృష్టించినవేనని అన్నారు. మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవేనని గుర్తుచేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదని సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలన్నారు. అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డిపేర్కొన్నారు.


ఐటీఐల రూపురేఖలు మారుస్తాం..

‘‘కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి. ఇంజనీరింగ్‌లో కేవలం కంప్యూటర్ సైన్స్ పైనే కాదు... సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి. స్కిల్ డెవలప్మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది. ఫార్మా, ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది. యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


త్వరలోనే జాబ్ క్యాలెండర్‌..

‘‘మా ప్రభుత్వానికి భేషజాలు లేవు... నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను తీసుకురాబోతున్నాం. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదనేదే మా ప్రభుత్వ విధానం. మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆర్థిక భారం, ఇతర సమస్యలు ఉన్నా... ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 05:48 PM