Share News

CP Srinivas Reddy: హైదరాబాద్‌లో నేరాలపై ఉక్కుపాదం..

ABN , Publish Date - Aug 14 , 2024 | 09:27 PM

నగరంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ చోరీలు, దొంగతనాలు సహా పలు నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజేంద్రనగర్‌లో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.

CP Srinivas Reddy: హైదరాబాద్‌లో నేరాలపై ఉక్కుపాదం..
Hyderabad CP Srinivas Reddy

హైదరాబాద్: నగరంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ చోరీలు, దొంగతనాలు సహా పలు నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజేంద్రనగర్‌లో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి పలు నేరాలకు సంబంధించిన వివరాలను సీపీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.


ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.."రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న డ్రగ్ పెడ్లర్ అనాస్ ఖాన్‌పై కొన్ని రోజులుగా నిఘా పెట్టాం. అనాజ్ ఖాన్, నైజీరియాకు చెందిన వ్యక్తి, మరో నిందితుడు రాజేంద్రనగర్ ప్రాంతంలో తరచూ ఒక చోట కలుస్తున్నారే సమాచారం అందింది. ఈ మేరకు నార్కోటిక్ బ్యూరో బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.10కోట్ల విలువైన ఆరు రకాల డ్రగ్స్ సీజ్ చేశాం. వారి నుంచి కొకైన్ 36గ్రాములు, MDMA 140గ్రాములు, ఎక్స్‌టీసీ మాత్రలు 9, LSD బ్లాట్‌లు 6, చరస్ 32గ్రాములు, మియావ్-మియావ్ 41గ్రాములు, అలాగే కారు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం" అని వెల్లడించారు.


నిందితులు వీరే..

అరెస్టయిన నిందితుల్లో నైజీరియాకు చెందిన ఓఫోజర్ సండే ఎజిక్, డెలివరీ బాయ్ సైఫ్, డ్రగ్ పెడ్లర్ అనాజ్ ఖాన్ ఉన్నారు. అయితే నైజీరియాకు చెందిన వ్యక్తి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. 2016లో స్పోర్ట్స్ వీసాపై భారత్‌కు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఇతను మెుదట్లో న్యూ ఢిల్లీలోని ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018వ సంవత్సరంలో బెంగళూరుకు మారాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ద్వారా ఆదాయం లేకపోవడంతో డ్రగ్స్ సప్లయర్‌గా మారాడు. బెంగళూరులో తక్కువ ధరకు నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రెట్టింపు ధరకు అమ్మే వాడు. మరో నిందితుడు అనాస్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. ఇతను డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. 2022వ సంవత్సరంలో నగరానికి వచ్చాడు. నైజీరియా వ్యక్తి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. డెలివరీ బాయ్ సైఫ్ ఖాన్ తన సోదరుడు కావడంతో అతని సహాయంతో వాటిని నిర్ణీత లోకేషన్‌కు సరఫరా చేయిస్తున్నాడు. ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసు బృందానికి రూ.3లక్షల రివార్డు ప్రకటించినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


సెల్‌ఫోన్ చోరీలపై స్పెషల్ ఫోకస్..

నగరంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సీపీ తెలిపారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. 25మందికి పైగా ప్రధాన నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లిడించారు. సెల్ ఫోన్ల చోరీ సమయంలో నిందితులు ప్రాణాలు కూడా తీస్తున్నారని పేర్కొన్నారు. వరస చోరీల నేపథ్యంలో డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నట్లు సీపీ చెప్పుకొచ్చారు. గతంలో పోల్చుకుంటే దొంగతనాల సంఖ్య తగ్గినట్లు ఆయన చెప్పుకొచ్చారు.


చైన్ స్నాచింగ్‌పై ఉక్కుపాదం..

వరస డెకాయ్ ఆపరేషన్ల ద్వారా 27మంది చైన్ స్నాచర్లను పట్టుకున్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ స్నాచింగ్ కేసుల్లో చాలా వరకు రిసీవర్స్ ఆట కట్టించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గుర్తించామని అన్నారు. అయితే తాజాగా వీటిపై కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ కేసులపై చేపట్టిన ఆపరేషన్‌లో రెండు ఓపెన్ ఫైర్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం స్నాచింగ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Aug 14 , 2024 | 09:27 PM