BJP: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:04 AM
తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదని, వాళ్లు మూసీ విడిచి వెళతామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా , గోదావరి నీళ్లు తెస్తాం అంటే సంతోషమేనన్నారు. అది మూసీ ప్రక్షాళన పేరిట ఇండ్లను కూలగొట్టి ఇస్తాం అంటే కుదరదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణను ఆగం చేసే పనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఒక్క టర్మ్ మాత్రమే ముఖ్యమంత్రి (Chief Minister)గా ఉంటారని, అది కూడా ఆ పార్టీ నాయకులు ఆయనకు సహకారం అందిస్తేనే సీఎంగా కొనసాగుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని విమర్శించడానికి మాకు అనేక అంశాలు ఉన్నాయని, అయితే తమ తపన అంతా పేద ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. నెక్స్ట్ టైం కాంగ్రెస్ గెలవదని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. వచ్చే గ్రేటర్ ఎన్నికలో మేయర్ పీఠం బీజేపీదేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము ఎవరిని రెచ్చగొట్టడం లేదని, వాళ్లు మూసీ విడిచి వెళతామంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా , గోదావరి నీళ్లు తెస్తాం అంటే సంతోషమేనన్నారు. అది మూసీ ప్రక్షాళన పేరిట ఇండ్లను కూలగొట్టి ఇస్తాం అంటే కుదరదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణను ఆగం చేసే పనికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఒకాయన గతంలో ఇలాగే చేసి.. అధికారం కోల్పోయి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేయాలి అనుకుంటే ఉన్న దాంట్లో చేయాలని, నిజాం కట్టిన రిటైనింగ్ వాల్ మాదిరిగా కట్టాలని, నలబై ఏళ్ల కిందట కట్టిన ఇండ్లను కూలగొట్టి నల్లగొండ ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్నారు. ఇండ్లను కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే పార్లమెంట్ సభ్యుడిగా తన వేతనాన్ని ఇవ్వడానికి సిద్ధమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ ఛలో మూసీ..
మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. కొన్ని రోజులుగా మూసీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి వివాదం మెుదలైంది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మండిపడుతున్నారు. రూ.25 వేల కోట్లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముడుపులు ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు హైడ్రా పేరుతో బుల్డోజర్లను పేదల ఇళ్లపైకి తెచ్చి కూల్చివేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణకు అడ్డుపడే నాయకులంతా మూడ్రోజులపాటు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దశాబ్దాలుగా మురుగు నీరు, భరించలేని కంపుతో మూసీ ప్రాంత ప్రజలు జీవిస్తున్నారని, దాన్ని బాగు చేద్దామని చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఏళ్లుగా ఆ కంపులోనే జీవిస్తున్నారని, వారి భవిష్యత్తు తరాలనైనా ఆ రొంపి నుంచి బయటపడేయాలని చూస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. మూసీ బాధితులకు స్థలాలు కేటాయించి రూ.10 వేల కోట్లతో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పారని సీఎం ప్రశ్నించారు. విమర్శించే నేతలంతా మూడ్రోజులపాటు ఆ ప్రాంతంలో నివసించాలని సీఎం సవాల్ విసిరారు. అలా ఉండగలిగితే తాను మూసీ ప్రక్షాళన అంశాన్ని విరమించుకుంటానని చెప్పారు. అలా చేయకుండా మూసీ ప్రక్షాళకు అడ్డొస్తే మాత్రం బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ సవాల్‌ను కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. దీనిలో భాగంగా నవంబర్ 16 రాత్రి నుంచి నవంబర్ 17 ఉదయం 9గంటల వరకూ బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. తనతోపాటు ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలంతా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇవాళ రాత్రి అంబర్‌పేట ప్రాంతంలోని తులసీ రామ్ నగర్లో తాను బస చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పేదల ఇళ్లల్లోనే పడుకోనున్నట్లు ఆయను చెప్పుకొచ్చారు. దాదాపు 20 ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలంతా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మలక్‌పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీ నగర్ ద్వారకాపురంలో ఎంపీ ఈటల రాజేందర్ బస్తీ నిద్ర చేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. "మాకు సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు ముఖ్యం కాదు. ప్రజల కోసం నిలబడటం ముఖ్యం. మూసీ, హైడ్రాల పేరిట బుల్డోజర్లు ఇళ్ల మీదకు వస్తాయని పేద ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి ధైర్యం ఇవ్వడం కోసమే ఇవాళ రాత్రి మూసీ బాధితుల ఇళ్లలో బస చేయాలని నిర్ణయించాం. రేపు ఉదయం వరకూ మూసీ ప్రాంతాల్లోని అన్ని బస్తీల్లో మా ఎంపీలు , ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి ఆరంభం మాత్రమే. మున్ముందు మా కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుంది" అని చెప్పారు.