Share News

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం లంచాలను పోత్సహిస్తోంది: కేటీఆర్..

ABN , Publish Date - Sep 22 , 2024 | 10:33 AM

వికారాబాద్‌ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం లంచాలను పోత్సహిస్తోంది: కేటీఆర్..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కమీషన్లు ఇవ్వందే అధికారుల వద్ద ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖలో వేలాది ఫైళ్లు పేరుకుపోయాయని అన్నారు. ముఖ్యంగా ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ ఫైళ్లు నత్తనడకన సాగుతున్నాయని, వివిధ దశల్లో అధికారులు సంతకాలు పెట్టక ఎక్కడివక్కడే ఉండిపోయాయన్నారు. కోట్లాది రూపాయలు ఫీజులు కట్టినా భవన నిర్మాణాలు, లేఅవుట్లకు కమీషన్ ఇవ్వందే పనులు జరగడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడుతూ.. ఓ వార్తాపత్రికకు సంబంధించిన క్లిప్‌ను ట్వీట్‌కు జత చేశారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

"తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరప్షన్ పెరిగిపోయింది. వివిధ పనులకు సంబంధించిన ఫైళ్లు నత్తనడకన నడుస్తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీఎత్తున ఫైళ్లు పేరుకుపోవడం దేనికి సంకేతం?. కారణాలు లేకుండా ఫైళ్లను తమ వద్దే ఎందుకు అధికారులు తొక్కిపెడుతున్నారు? దీని వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలి. అనుమతుల్లో అవినీతి నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ తెచ్చింది. అంతటి పారదర్శక విధానాన్నీ రేవంత్ సర్కార్ తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పెద్దలకు అమ్యామ్యాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది" అన్నారు.


మరో ట్వీట్..

తెలంగాణలో అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి వికారాబాద్‌ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. మూడు వేల ఎన్నరాల్లో విస్తరించిన అడవిలో 12.5లక్షల చెట్లు ఉన్నాయని, ఎన్నో ఔషధ విలువలతో కూడిన మెక్కలూ ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. అలాంటి జీవావరణ వ్యవస్థను కాపాడేందుకే అడవిని కేంద్రానికి ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించిందని ఆయన చెప్పుకొచ్చారు.


మూసీ నది దామగుండం అడవుల్లోనే ఉద్భవించిందని, ఆ ప్రాంతం గొప్ప జీవవైవిధ్యానికి నిలయమని కేటీఆర్ కొనియాడారు. అయితే దామగుండం అడవులను కేంద్రానికి అప్పగించికుండా స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చందు సమస్యను భుజాన వేసుకున్నందుకు అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) ఇందిరాపార్క్‌లో ఆమె చేపట్టే శాంతియుత నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆమెకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాగ్దానం చేశారు. దామగుండం అటవీ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీఆర్ఎస్ నిర్ణయించిందని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని లేకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Sep 22 , 2024 | 10:35 AM