Share News

G. Kishan Reddy: గనులు, పర్యావరణం రెండు కళ్లు!

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:46 AM

గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్‌ మినరల్‌) గనుల నాలుగో విడత వేలాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘

G. Kishan Reddy: గనులు, పర్యావరణం రెండు కళ్లు!

  • ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ దేశానికి రెండు కళ్లలాంటివని, వీటికి తాము సమ ప్రాధాన్యమిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్‌ మినరల్‌) గనుల నాలుగో విడత వేలాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘కొత్త గనుల చట్టం వచ్చాక గనుల వేలానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. ఇప్పటివరకు 3 విడతల వేలం పూర్తయింది. నాలుగో విడత వేలం మొదలైంది. ఈ కొత్త చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం. ఈ రంగం ఆర్థికంగా రాష్ట్రాలకు లబ్ది చేయడంతో పాటు వేలమందికి ఉపాధి కల్పిస్తుంది’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


ఖనిజాల తవ్వకం భారతదేశానికి చాలా కీలకమని, అందుకే ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం అన్నిరకాలుగా భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. గనులు తీసుకున్న వారు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, గనుల మంత్రిత్వ శాఖ 24/7 అండగా నిలబడుతుందని తెలిపారు. ‘ఐదు టిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగే క్రమంలో గనుల రంగంలో సాధించనున్న ప్రగతి అత్యంత కీలకం కానుంది. మోదీ వచ్చాకే రాష్ట్రాలకు వాటా సరిగ్గా అందుతోంది. ఉదాహరణకు ఒక్క ఒడిసాలోనే ఏడాదిలో రూ. 40వేల కోట్ల లబ్ది చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా సహకరించాలి.


భాగస్వామ్య పక్షాలు సహకరిస్తే, ప్రతి 15 రోజులకో సంస్కరణ తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ‘స్కీమ్‌ ఫర్‌ పార్షియల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఎక్స్‌పెన్సెస్‌ ఫర్‌ హోల్డర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ లైసెన్స్‌’ పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలకు మైనింగ్‌ ఎక్స్‌ ప్లొరేషన్‌ లైసెన్స్‌లను, ఈ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీలు ఆర్‌అండ్‌డీ సంస్థలకు ప్రోత్సాహకాలను అందజేశారు.

Updated Date - Jun 25 , 2024 | 04:46 AM