Share News

TG News: నాగార్జునసాగర్‌కి పెరిగిన పర్యాటకుల రద్దీ

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:12 PM

నాగార్జునసాగర్‌కి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్‌ వద్దకు భారీగా తరలి వస్తున్న పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదు.

TG News: నాగార్జునసాగర్‌కి పెరిగిన  పర్యాటకుల రద్దీ
Nagarjunasagar

నల్గొండ: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్‌ డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు నాగార్జున సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్‌ గేట్ల ద్వారా జాలువారే నీటిని వీక్షిస్తున్నారు. అనంతరం శాంతిసిరి, నాగసిరి లాంచీలలో నాగార్జున కొండకు పర్యాటకులు తరలివెళ్లారు.


రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. అయితే, నాగార్జునసాగర్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్‌ అందాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతుండటంతో ప్రధాన డ్యామ్‌, పవర్‌ హౌస్‌ పరిసరాల్లోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.


ఇదిలా ఉంటే.. ప్రజలు అధికంగా వస్తుండటంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్‌ వద్దకు భారీగా తరలి వస్తున్న ట్రాఫిక్‌ను త్వరగా క్లియర్ చేయడం లేదని పర్యాటకులు విమర్శలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేవలం పోలీస్ కుటుంబాలకు, బంధువులకు మాత్రమే పర్యాటక కేంద్రంగా మారిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సంబంధించిన వాహనాలను పంపించే పనిలోనే సెక్యూరిటీ ఉన్నారని అన్నారు.


వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పటికీ పర్యాటక కేంద్రం దగ్గరకు వెళ్లనివ్వడం లేదని కొంతమంది పర్యాటకులు అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రాజెక్టు వద్దకు కేవలం రికమండేషన్‌ ఉంటేనే వాహనాలు పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని పర్యాటకులు మండిపడుతున్నారు.


కాగా, మీడియాకు కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. నాగార్జున సాగర్ వద్ద పోలీసుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీక్షకులు చెబుతున్నారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చిన్న పిల్లలతో వచ్చిన వారు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండతో మరో వైపు ట్రాఫిక్‌తో పర్యాటకులు చాలా అవస్థలు పడుతున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 04:26 PM