Share News

Hyderabad: నిబంధనల పేరుతో కోతలుండవు!

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:01 AM

రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి.

Hyderabad: నిబంధనల పేరుతో కోతలుండవు!

  • గత నిబంధనలతోనే రుణమాఫీ

  • గ్రామీణ బ్యాంకులు, సొసైటీల్లోని గోల్డ్‌ రుణాలకూ వర్తింపు

  • త్వరలోనే విఽధివిధానాల జీవో: పొన్నం

హైదరాబాద్‌, హుస్నాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకేసారి రూ.31వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త రుణమాఫీలో కోతలు కోసం కొత్త నిబంధనలేమీ తీసుకురాకపోవచ్చునని అంటున్నారు. గతంలో రుణమాఫీ అర్హతకు ఉన్న నిబంధనలనే అమలుచేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం మంత్రులు, అధికారుల స్థాయుల్లో చర్చ జరుగుతోంది. రుణమాఫీ విదివిధానాలకు సంబంధించిన వివరాలతో కూడిన జీవో త్వరలోనే విడుదలకానుంది. రాష్ట్రంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రూ.2లక్షల మేర రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.


ఈ మేరకు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీని కటాఫ్‌ తేదీగా కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రుణమాఫీని ఎవరెవరికి వర్తించాల నేదా నిపై అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా భూమి పాస్‌బుక్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. అదే సమయంలో ఆయా బ్యాంకుల్లో భూమి పాస్‌బుక్‌ ఆధారంగా తీసుకున్న బంగారు రుణాలను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకుని మాఫీని వర్తించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల్లో బంగారు రుణాలు ఎన్ని ఉన్నాయనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పీఎం కిసాన్‌లో అనర్హులుగా ఉన్నవారిలోనూ చాలామందికి రుణమాఫీ వర్తించనున్నట్టు నిధుల అంచనాతో స్పష్టమవుతోంది.


బంగారం లోన్లపై పరిశీలన..

రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే రైతుల రుణమాఫీ విషయంలో బంగారం రుణాలను ప్రత్యేకంగా చూడనున్నట్టు సమాచారం. గ్రామీణ బ్యాంకులు, సొసైటీ బ్యాంకుల్లో భూమి పాస్‌బుక్‌ ఆధారంగా తీసుకున్న రుణాలకు మాఫీని వర్తించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం రైతులు ఏయే బ్యాంకుల్లో ఎంతమేర బంగారం పెట్టి రుణాలు తీసుకున్నారనే విషయాలను తేల్చనున్నారు. అనంతరం రూ.2లక్షల వరకు తీసుకున్న రుణమైతే దానికి మాఫీని వర్తింపజేయనున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో స్థిరపడిన భూయజమానులు వ్యవసా యేతర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటే మాఫీ వర్తించదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని కొత్తూరుకు చెందిన యాదగిరికి 4ఎకరాల భూమి ఉంది. యాదగిరి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాడు. అయితే తన భూమి పాస్‌బుక్‌ను హైదరాబాద్‌లోని బ్యాంకులో పెట్టి దానిపై గోల్డ్‌ లోన్‌ తీసుకుంటే మాత్రం అతనికి రుణమాఫీ వర్తించదు. ఒక వేళ యాదగిరి హైదరాబాద్‌లోనే ఉంటూ.. తన గ్రామమైన కొత్తూరు పరిధిలోని బ్యాంకులో వ్యవసాయం కోసం భూమి పాస్‌బుక్‌పై బంగారపు రుణం పొందితే రుణమాఫీ వర్తిస్తుంది. ఆ గోల్డ్‌ లోన్‌ను గ్రామీణ బ్యాంకులు, లేదా సొసైటీ బ్యాంకులోనే తీసుకుని ఉండాలి. కాగా గతంలోనూ బంగారం రుణాలపై ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. మొత్తంగా అర్హులైన రైతులందరినీ రుణవిముక్తులను చేసి, ఆర్ధికంగా తోడ్పాటునివ్వాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.


మహత్తర ఘట్టం: పొన్నం

త్వరలోనే రైతుల రూ. 2లక్షల రుణమాఫీపై విధివిధానాలతో పాటు జీవో వెలువడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయనుండటం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కేబినెట్‌ మంత్రిగా ఈ మహోత్తర ఘట్టంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నందుకు రైతు బిడ్డగా సీఎం రేవంత్‌, సహచర మంత్రులకు ధన్యవాధాలు తెలుపుతున్నానని చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 04:01 AM