Vikarabad: భూములు ఇవ్వం.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం..
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:16 PM
దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తాండా గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు.
వికారాబాద్: దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దుద్యాల, లగచర్ల, పోలేపల్లి, రోటిబండ తాండా గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. దీనిపై రైతులతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆయా గ్రామాలలో పర్యటించనున్నారు. వారితో మాట్లాడి కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. కలెక్టర్ రావడానికి ముందే పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఒంటిపై పెట్రోల్ పోలుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కలెక్టర్‌తో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవిటి శేఖర్.. హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరారు. రోటిబండ తాండా వద్దకు శేఖర్ చేరుకోగానే స్థానిక గిరిజన రైతులు ఆయన్ని అడ్డుకున్నారు. తాము భూములు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు. అయితే భూములు ఇవ్వాల్సిందే అంటూ శేఖర్ రైతులకు తెగేసి చెప్పారు.
దీంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ నేతపై దాడి చేసి స్థానిక పంచాయతీ కార్యాలయంలో బంధించారు. కాంగ్రెస్ నేత శేఖర్‌ను విడిపించేందుకు పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బొంరాస్ పేట్ ఎస్సై అబ్దుల్ రాహుఫ్ రెండు చేతులు జోడించి ఆందోళన విరమించాలని రైతులను కోరారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం కాస్త ముదరడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురు రైతులకు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో దుద్యాల మండలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.