Share News

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:48 AM

ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

  • భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు: వీసీ సజ్జనార్‌

  • పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం: పటేల్‌ రమేశ్‌రెడ్డి

భువనగిరి అర్బన్‌, జూలై 28: ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు.. సజ్జనార్‌కు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం సజ్జనార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. యాదగిరి క్షేత్రానికి భక్తుల రాక ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని బస్సులు నడిపేందుకు సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే యాదగిరిగుట్ట డిపోకు కొత్త బస్సులు మంజూరయ్యాయని, త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.


హైదరాబాద్‌-వరంగల్‌ 163 జాతీయ రహదారిపై ఉన్న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద రిక్వెస్ట్‌ స్టాప్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైన గల హరిత హోటల్‌లో 30 గదులకు 15 మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగిలిన వాటిని మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని భక్తులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Jul 29 , 2024 | 03:48 AM