Share News

TG News: పిడుగులు పడి ముగ్గురు మహిళల మృతి

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:23 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో ఇద్దరు మహిళా కూలీలు, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో ఓ మహిళా రైతు మృతి చెందారు.

TG News: పిడుగులు పడి ముగ్గురు మహిళల మృతి

  • భద్రాద్రి జిల్లాలో ఎడ్లబండితో వాగులో కొట్టుకుపోయి రైతు మృతి

  • ఖమ్మం జిల్లాలో పలుచోట్ల గాలివాన

  • 3 నెలలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

  • వాతావరణ శాఖ.. నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, అక్టోబరు 2: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లిలో ఇద్దరు మహిళా కూలీలు, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లిలో ఓ మహిళా రైతు మృతి చెందారు. ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకాలపల్లి నిర్మల(51), సోలంకె రమ(45) బుధవారం ఓ రైతు పొలంలో పనులు చేస్తుండగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. నిర్మల, రమ దగ్గరలో ఉన్న చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి గ్రా మానికి చెందిన కారట్లపల్లి లక్ష్మి(45) తన మిరప తోటకు ఎరువు చల్లేందుకు బుధవారం మధ్యాహ్నం వెళ్లగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.


భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం తండాకు చెందిన బానోత్‌ బాలు ఇంటి సమీపంలో పిడుగు పడి అస్వస్థతకు గురయ్యాడు. వరద ప్రవాహానికి ఓ రైతు వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన ఘట న బుధవారం భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండాలో జరిగింది. అంగోతు గాంధీ(32) అనే రైతు తన భార్య రజిత, తండ్రి లక్ష్మా, మరికొంత మంది కూలీలతో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని సాయంత్రం అందరు ఎడ్లబండిపై తిరిగి వస్తూ వాగు దాటుతుండగా నీటిప్రవాహం ఎక్కువగా ఉండి ఎడ్లబండి కొట్టుకుపోయింది. బండిలో ఉన్నవారిని పక్కన ఉన్నవారు రక్షించారు. అయితే ఎడ్లబండి తిరగబడి వాగులో పడి ఉన్న చెట్టును ఢీకొనడంతో బండి తో లుతున్న గాంధీ మృతి చెందాడు.


మరోవైపు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రఘునాథపాలెం మండలంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైరాలో గాలి దుమారంతో చెట్లు నేలకూలడంతో వైరా, మధిర, జగ్గయ్యపేట రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఖమ్మంలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా అక్టోబరు నుంచి డిసెంబరు వరకు తెలంగాణలో వర్షపాతం సాధారణంకన్నా అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబరు నెలలో ఉత్తర తెలంగాణలో సాధారణంకంటే ఎక్కువగా.. దక్షిణ తెలంగాణలో సాధారణంకంటే తక్కువగా, మిగతా ప్రాంతా ల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.


ఈమేరకు బుధవారం వర్షాకాల అనంతర దీర్ఘకాల వాతావరణ సూచనను విడుదల చేసింది. అలాగే అక్టోబరులో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణంకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో గురు, శుక్రవారాలు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలోని వికారాబాద్‌, సంగారె డ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Oct 03 , 2024 | 03:23 AM