Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

ABN , First Publish Date - 2022-12-31T15:23:20+05:30 IST

1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.

Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

విలక్షణ నటుడిగా ప్రసిద్ధులైన కళావాచస్పతి కొంగర జగ్గయ్య (Kongara Jaggayya) మన దేశం మొత్తంలో దిగువసభ (Lok Sabha) కి ఎన్నికైన తొలి నటుడు. 1967లో ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొంది, ప్రజలు గెలిపించిన భారతీయ నటులలో తొలి లోక్ సభ సభ్యుడిగా చరిత్రకెక్కారు.

విద్యార్థి దశ నుండే రాజకీయాలు

చాలా మంది నటీనటుల గ్లామర్, ప్రజల్లో వారి పాపులారిటీని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయపార్టీలు సినీతారలని ఎన్నికల బరిలో దించడం, రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వాల తాయిలాలతో వారిని తమవైపుకు తిప్పుకోవడం రివాజుగా మారింది. సినిమా స్టార్లు కూడా తమ స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుబడులుగా రాజకీయలబ్ధి పొందే ప్రయత్నాలు చేయడం కూడా పరిపాటి అయ్యింది.

కానీ, జగ్గయ్య రాజకీయజీవితం భిన్నమైంది. తెనాలి తాలూకా దుగ్గిరాల దగ్గర మోరంపూడిలో 1928 డిసెంబర్ 31న పుట్టిన జగ్గయ్య తన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. నిర్ధిష్టమైన భావజాలంతో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. తెనాలి కేంద్ర అభ్యుదయ, సమసమాజ భావాలు చిన్ననాటి నుంచే వంటబట్టడం వల్ల కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు తెనాలిలో సెక్రటరీగా పనిచేసారు. వేరే రాష్ట్రాలలో జరిగే పార్టీ సదస్సులకి హాజరై ఆ సదస్సుల తీర్మానాల్ని తెలుగులోకి అనువదించి వాటి కాపీలని స్థానికంగా పంచిపెట్టేవారు.

కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు గ్రూపుల్ని నిషేధించిన తరువాత, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో చేరారు జగ్గయ్య. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆదర్శాలకీ దేశ యువత ఉర్రూతలూగిన కాలమది. జాతి యువతకి నెహ్రూ ఇచ్చిన పిలుపుకి ఉత్తేజితులై 1956లో జగ్గయ్య మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Jaggayya-3.jpg

నెహ్రూ వల్ల ఐదేళ్లు ఆలస్యమయ్యిందా?

జగ్గయ్య స్వతహాగా మంచి రచయిత, రూపం, వాచకం, అభినయం అదనపు ఆకర్షణలుగా ఉండేవి. చిన్ననాటి నుంచే మంచి చదువరి. తెలుగు, ఇంగ్లీషు మాత్రమే కాకుండా బెంగాల్ సాహిత్యంతో కూడా ప్రభావితమయ్యారు. బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన 'సీత ' నాటకాన్ని హిందీలో ప్రదర్శిస్తే 11 సంవత్సరాల జగ్గయ్య అందులో లవుడి పాత్ర వేశారు.

పీయూసీ తర్వాత దేశాభిమాని అనే పత్రికలో నూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ (Andhra Republic) అనే ఇంగ్లీషు పత్రికలోనూ సబ్ ఎడిటర్ గా పనిచేశారు. తర్వాత గుంటూరు ఏసీ కాలేజ్ (Andhra Christian college) లో తన తోటి విద్యార్థి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao- NTR) తో కలిసి నాటకాలు వేసేవారు జగ్గయ్య.

జగ్గయ్య వాగ్ధాటి, కంచుకంఠం నాటకాల ప్రేక్షకుల్నే కాదు, రాజకీయసభల్లో జనాల్ని కూడా ఆకర్షించేవి. దాంతో 1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.

స్వతంత్ర పార్టీ నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా గెలుపునకు మార్గం సుగమం చేయాలని నెహ్రూ జగ్గయ్యని పోటీ నుంచి తప్పుకోమన్నారు. రంగాకి విజయావకాశాలు లేవని, కాంగ్రెస్ పోటీలో లేకపోయినా, ఆయన కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోతారనీ, జగ్గయ్య జోస్యం చేప్పారట నెహ్రూకి. రంగా అంతటి గొప్పనాయకుడి ఓటమికి మనం కారణం కాకపోతే చాలు అన్నారట నెహ్రూ.

అలా నెహ్రూ అడ్డుపడకపోయుంటే, జగ్గయ్య 1962లోనే లోక్ సభకి ఎన్నికయ్యేవారు అంటారు రాజకీయవిశ్లేషకులు. జగ్గయ్య అన్నట్టుగానే రంగా ఓటమిపాలయ్యారు. తన విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వదిలి, కృషికార్ లోక్ శక్తి పార్టి, ఆ తర్వాత రాజాజీ, మీనూ మాసాని, కె.యం.మునీషిలతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించిన ఆచార్య రంగా గెలుపు కోసం నెహ్రూ ఆరాటపడటం అప్పటి రాజకీయ విలువలకి తార్కాణమని అనేవారు జగ్గయ్య అప్పటి ఇంటర్వ్యూల్లో.

చిత్తూరు ఎంపీగా ఎన్నికైన అనంతశయన అయ్యంగార్ ని బీహార్ గవర్నర్ గా కేంద్రం నియమించడంతో, చిత్తూరుకి జరిగిన ఉప ఎన్నికలో ఆచార్య రంగా గెలుపునకు నెహ్రూ దోహదపడ్డారని ప్రముఖ రైతు నాయకుడు, ఆచార్య రంగా సహచరుడు యలమంచిలి శివాజీ వెబ్- ఆంధ్రజ్యోతితో అన్నారు. ఆ తర్వాత 1967లో నాల్గవ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకి పెట్టని కోటగా ఉన్న ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి, 80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు జగ్గయ్య.

Jaggayya-2.jpg

నటిస్తూన్నా వీడని రాజకీయ చైతన్యం

మహారచయిత త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వం వహించిన 'ప్రియురాలు ' సినిమాతో జగ్గయ్య సినిమారంగంలో కాలుమోపారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎటువంటి సినిమాల్లో నటించినా, తాను నిర్మాతగా మాత్రం సామాజిక స్పృహ, రాజకీయచైతన్యం నిండిన సినిమాలనే తీశారాయన.

1962లో జగ్గయ్య నిర్మించిన 'పదండి ముందుకు సినిమాకి 1930లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమమే నేపథ్యం. తొలి రాజకీయ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఆ సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. ఆ సినిమాకి డైలాగ్స్ రాయడమే కాకుండా, 'మంచికి కాలం తీరిందా' అనే పాటను కూడా రాశారు జగ్గయ్య. సోవియెట్ రష్యాలో జరిగే తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ తో బాటు మరికొన్ని అంతర్జాతీయ వేదికల మీద పదండి ముందుకు ప్రదర్శించబడింది.

ఐదేళ్ళపాటు పార్లమెంటులో ప్రజాసమస్యలపై తన గళాన్ని వినిపించారు జగ్గయ్య. ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి పెట్టిన రెడ్డి కాంగ్రెస్ లో చేరి, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో దుగ్గిరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. అంతటితో ఆయన రాజకీయ జీవితానికి తెరపడింది. జగ్గయ్య ఎంపీగా గెలిచిన 15 ఏళ్ల తర్వాత, 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారు. అయినప్పటికీ జగ్గయ్య రాజకీయాలవైపు చూడలేదు.

(డిసెంబర్ 31న జగ్గయ్య జయంతి సందర్భంగా..)

Updated Date - 2022-12-31T15:43:33+05:30 IST