India vs Canada: నిప్పుతో చెలగాటం.. భారత్, కెనడా వివాదంపై ప్రపంచ దేశాలు ఏమంటున్నాయంటే..?
ABN , First Publish Date - 2023-09-20T11:59:37+05:30 IST
భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.
భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు కూడా వేశారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. అంతేకాకుండా భారత్‌లోని కెనడా దౌత్యవేత్తపై వేటు వేసి ట్రూడోకు గట్టి కౌంటరిచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల పరిస్థితులు మరింత దిగజారాయి. అయితే ఈ వివాదంపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అంతేకాకుండా భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికాలోని కొంతమంది నిపుణులు ట్రూడో తీరును ఖండిస్తున్నారు. భారత్‌పై కెనడా ఆరోపణలు సిగ్గు చేటు అని అన్నారు. భారత్-కెనడా మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై వాషింగ్టన్లో హడ్సన్ ఇన్‌స్టిట్యూల్ చర్చాకార్యక్రమం జరిగింది. ఈ చర్చలో పలువురు నిపుణులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న పలువురి చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని వారు అభిప్రాయపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలోకి భారత్‌ను లాగడం సిగ్గు చేటన్నారు. దీర్ఘకాలంలో ట్రూడోకు ఇది రాజకీయంగా లాభం చేకూర్చినా.. నాయకత్వ లక్షణం మాత్రం కాదని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు జోక్యం చేసుకోకపోవడం మంచిదని వారు సూచించారు. ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని చర్చలో పాల్గొన్న నిప్పులు హెచ్చరించారు.
అటు భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా కూడా స్పందించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మీడియాతో మాట్లాడారు. భారత్‌పై కెనడా చేసిన ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరినామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తమ ఆందోళనను భారత్‌తో కూడా పంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనపై తాము ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమని పెన్నీ వాంగ్ చెప్పారు. అటు బ్రిటీష్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ కూడా భారత్-కెనడా వివాదంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమన్న ఆయన దీనిపై యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. అలాగే ఈ వివాదంలో న్యాయం జరగాలని తన్మన్జీత్ సింగ్ ఆశించారు.
అసలు ఏం జరిగిందంటే.. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ నేడు ఉదయం ఖండించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే కెనడా రాయబారిపై కూడా వేటు వేసింది. కాగా ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు.
దీంతో కెనడా ఆరోపణలపై భారత్ స్పందించింది. కెనడా ఆరోపణలను ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెనడా ప్రధానమంత్రి వారి పార్లమెంటులో చేసిన ప్రకటనను, వారి విదేశాంగ మంత్రి ప్రకటనను కూడా మేము చూశాము. కెనడా ఆరోపణలను ఖండిస్తున్నాం. కెనడాలో జరిగిన హింసాత్మక చర్యలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి. మనది చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్యం. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాయి. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తెస్తాయి. ఈ విషయంపై కెనడియన్ ప్రభుత్వం నిష్క్రియాత్మక వైఖరి చాలా కాలంగా నిరంతర ఆందోళనకు గురి చేస్తోంది. కెనడా రాజకీయ ప్రముఖులు బహిరంగంగా ఇలాంటి అంశాల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కెనడాలో స్థలం ఇవ్వడం కొత్తది కాదు. అటువంటి పరిణామాలకు భారత ప్రభుత్వాన్ని అనుసంధానించే ప్రయత్నాలను మేము తిరస్కరించాము. కెనడా ప్రభుత్వం తమ గడ్డపై పని చేస్తున్న అన్ని భారత్ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా సత్వర, సమర్థవంతమైన చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము.’’ అని పేర్కొంది.