Share News

CM Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

ABN , First Publish Date - 2023-12-12T21:20:00+05:30 IST

ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్: ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతోపాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.

Revanth Reddy Review.jpg

నియామకాలపై కట్టు దిట్టమైన చర్యలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలకు సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా తగు మార్గ దర్శకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీగుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె.శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.


పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ : సీఎం రేవంత్‌రెడ్డి

త్వరలో జరుగనున్న పదోరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలో విద్యా శాఖ పై సీఎం సమీక్షా సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2023-12-12T21:33:16+05:30 IST