Mynampally Resigned: బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి బిగ్ ఝలక్.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-22T22:07:55+05:30 IST

బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు.

 Mynampally Resigned: బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి బిగ్ ఝలక్.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?

ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించినట్లు మైనంపల్లి ఓ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మైనంపల్లి అధిష్ఖానంపై అలకబూనారు. తన కొడుకుకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్(Malkajgiri, Medak) రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం పలుమార్లు సీఎం కేసీఆర్‌(CM KCR)ని అడిగిన ఇవ్వకపోవడంతో అలకబూనారు. దీంతో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao)పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబంలో అన్ని పదవులు ఏంటని గతంలో మైనంపల్లి హాట్ కామెంట్స్ వ్యక్తం చేశారు. పార్టీలో ఒక్కొక్కరి సంగతి ప్రజలకు చెప్తానని మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయడానికి తన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని మైనంపల్లి తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ గూటికి మైనంపల్లి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


మైనంపల్లి ఏం చెప్పారంటే..

‘‘మల్కాజ్‌గిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియోలో ప్రకటించారు. తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తాను. ఇంతవరకు అందించిన అందరి సహకారానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను. మల్కాజ్‌గిరి ప్రజలకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను.. దేనికి లొంగే ప్రసక్తే లేదు’’ అని మైనంపల్లి హనుమంతరావు వీడియోలో తెలిపారు.

కాంగ్రెస్‌ వైపే మొగ్గు..

కాగా.. కొన్ని రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ మెదక్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి సరైన నిర్ణయం రాకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీనే సరైనదని మైనంపల్లి హన్మంతరావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఆయనను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీ మారితేనే తనకు, తన కొడుకుకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్లడానికే ఆలోచిస్తున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఢిల్లీ వెళ్లిన వేముల వీరేశం రేపు మల్లిఖార్జున ఖర్గే సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. మైనంపల్లి హన్మంతరావు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్‌కు ఈ రెండు నియోజకవర్గాలల్లో గెలుపు అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-22T23:08:03+05:30 IST