Share News

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

ABN , Publish Date - Aug 04 , 2024 | 04:27 PM

ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు.

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు
Kiran Kumar Reddy

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం నాడు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. ఇద్దరు నేతలు కలిసి పలు విషయాలపై చర్చించారు. ఎన్డీఏ నేతలతో భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి అమర్నాథ రెడ్డి తేనేటి విందు ఇచ్చారు.

అనంతరం కిరణ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి, మాకు ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉంది.. అదే సంప్రదాయన్ని ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం’’ అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.


చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. పోలవరం పూర్తయితే, 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌ ఇదని చెప్పారు. 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరెంట్ యూనిట్ 10 నుంచి 15 పైసలకే తయారు చేయొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్ధంగా సరిచేసి, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఆ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర: ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరులోని కీలపట్ల దేవస్థానం టీటీడీ పరిధిలోకి తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి (MLA Amarnath Reddy) తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలపట్ల వేంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ పరిధిలోకి చేర్చారని అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.


రైతులను ఆదుకుంటాం: అచ్చెన్నాయుడు

మరోవైపు... అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు. ఆదివారం నాడు ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ చేశామని తెలిపారు.


విత్తన పంపిణీపై ఆదేశాలు..

విత్తన పంపిణీపై తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరి పంటలు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా ఉన్న సుమారు 1406 హెక్టార్ల నారుమళ్లు, 33వేల హెక్టార్లలో నాట్లు పూర్తయిన వరి పంట ముంపునకు గురైందని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుమారు 6356 క్వింటాళ్ల వరి విత్తనాలను తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో గల ప్రతి రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయటానికి సిద్ధం చేశామని అన్నారు. అధిక వర్షాలతో నారుమళ్లు, నాటిన వరి పంటలు దెబ్బ తిన్న రైతులు 80% రాయితీపై తమ తమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా తీసుకోవచ్చని వెల్లడించారు. మంచి సాగు యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని అచ్చెన్నా యుడు కోరారు.

Updated Date - Aug 04 , 2024 | 04:50 PM