Share News

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

ABN , Publish Date - Aug 19 , 2024 | 10:04 PM

కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Pastor Arrest: ముగ్గురు చిన్నారులపై మృతి కేసులో పాస్టర్ అరెస్టు..

అనకాపల్లి: కోటవురట్ల మండలం కైలాసలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతిచెందిన కేసులో పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పాస్టర్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో శనివారం రోజున పాచిపోయిన బిర్యానీ పెట్టడంతో సుమారు 38మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధిత చిన్నారులను పాస్టర్ ఆస్పత్రికి తరలించకుండా ఇళ్లకు పంపడంతో పరిస్థితి మరింత విషమించింది. చికిత్సపొందుతున్న చిన్నారుల్లో ఇవాళ(సోమవారం) ముగ్గురు మృతిచెందారు. దీంతో నిందితుడు కిరణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఎం.దీపికా తెలిపారు.


ఈ సందర్భంగా ఎస్పీ ఎం.దీపికా మాట్లాడుతూ.. " చిన్నారుల మృతికి కారణమైన పరిశుద్ధాత్మ ఆరాధన మందిరం నిర్వాహకుడు కిరణ్ కుమార్‌పై 304(2) సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశాం. అనంతరం నిందితుణ్ని అరెస్టు చేసాం. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరంలో 86మంది చిన్నారులు ఉన్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన పాడైన బిర్యాని పిల్లలకు పెట్టడంతో సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని భవాని, శ్రద్ధ, జాషువా అనే ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, మరో 35మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే నిర్వాకుడు కిరణ్ కుమార్ అస్వస్థత గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చకుండా ఇళ్లకు పంపడం వల్ల పరిస్థితి విషమించింది. ట్రస్ట్ నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించాం. సంఘటనకు కారణమైన అందరి పైనా చర్యలు తీసుకుంటాం. ట్రస్ట్‌కు లైసెన్సు, హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాం" అని తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 10:04 PM