Share News

MVV Satyanarayana: నాపై తప్పుడు ప్రచారం చేశారు.. మాజీ MP MVV సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Aug 03 , 2024 | 08:53 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తాము అందరం షాక్‌లోకి వెళ్లి పోయామని విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు వార్తలు రావడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

MVV Satyanarayana: నాపై తప్పుడు ప్రచారం చేశారు.. మాజీ MP MVV సంచలన ఆరోపణలు
MVV Satyanarayana

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తాము అందరం షాక్‌లోకి వెళ్లి పోయామని విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు వార్తలు రావడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో తన కార్యాలయంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హేమంత్ తన కుటుంబాన్ని, తన స్నేహితుడు జీవీని కిడ్నాప్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో కుట్ర కోణం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హేమంత్‌కు తనకు సంబంధాలు ఉన్నాయని.. ఇద్దరు మధ్య వివాదాలు తలెత్తడం వల్లే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు.


ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు..

‘‘కిడ్నాప్ కేసును పునర్విచారణ చేయాలని అంటున్నారు. కిడ్నాప్ వ్యవహారంపై పునర్విచారణ చేయాలని నేను కోరుతున్నాను. హేమంత్‌కు విలువైన బహుమతులు నేను మా వియంకుడు ఇచ్చామని వార్తలు రాస్తున్నారు. నేను హేమంత్‌కు ఇచ్చిన కార్లు, విల్లాలు ఎక్కడ ఉన్నాయో నాకు చెప్పాలి. ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలందించాను. నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. హేమంత్‌‌తో ఫోన్లో, వ్యక్తిగతంగా గాని మాట్లాడినట్లు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నా కుమారుడిని బంధిస్తే డబ్బులు వస్తాయని ఆలోచనతో హేమంత్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ కోసం నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను.


హయగ్రీవ ప్రాజెక్ట్‌కు నాకు ఏం సంబంధం లేదు..

‘‘హేమంత్‌కు నాకు ఎలాంటి పరిచయం లేదు.. అతనికి ఎటువంటి బహుమతులు ఇవ్వలేదు. సిరిపురం వద్ద కూడలి నేను మూసేశానని ఆరోపించారు. టీడీఆర్‌లు అక్రమంగా కొట్టేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ స్థలాన్ని నేను చట్టబద్ధంగానే తీసుకున్నాను. హయగ్రీవ ప్రాజెక్ట్‌కు నాకు ఎటువంటి సంబంధం లేదు. హయగ్రీవ జగదీశ్వరుడుపై 114 కేసులు ఉన్నాయి.. ప్రజలను మోసగించడంలో ఆయన దిట్ట. హయగ్రీవ ప్రాజెక్ట్‌లో నిర్మాణాలకు సలహాలు మాత్రమే ఇచ్చాను.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. మేము రాజకీయం, వ్యాపారం రెండింటిలో ఉన్నాం కాబట్టి మాపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి విషయాన్ని నాకు ముడిపెడుతున్నారు కాబట్టి ఈరోజు వివరణ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చాను. భూ వివాదాల విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తున్నాం’’ అని ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 09:02 PM