18th Lok Sabha : కొలువుదీరిన లోక్‌సభ
ABN , Publish Date - Jun 25 , 2024 | 05:24 AM
పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
కొత్త పార్లమెంటు భవనంలో వేడుకగా కార్యక్రమం
తొలి రోజు 280 మంది సభ్యుల ప్రమాణం పూర్తి
విపక్షాల నిరసన సెగ.. నీట్‌పై నినాదాల హోరు
మోదీ ప్రమాణం వేళ రాజ్యాంగం చూపిన రాహుల్
ప్రొటెం స్పీకర్ ప్యానల్‌లోని ముగ్గురి వాకౌట్
భర్తృహరి నియామకాన్ని నిరసిస్తూ నిర్ణయం
అచ్చ తెలుగులో..
కిషన్‌రెడ్డి, సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని సహా మాతృభాషలో 17 మంది ఎంపీల ప్రమాణం
పంచెకట్టుతో పార్లమెంటుకు హాజరైన కిషన్‌రెడ్డి
నేడు 15మంది తెలంగాణ ఎంపీల ప్రమాణం
న్యూఢిల్లీ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ కొత్త భవనంలో 18వ లోక్‌సభ కొలువుదీరింది. ఈ భవనంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. తొలుత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ లోపలికి వచ్చేటప్పుడు సభ్యులు నిలబడి కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు.
మోదీ అందరికీ అభివాదం చేస్తూ లోనికి చేరుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. తొలుత లోక్‌సభ ప్యానెల్ చైర్‌పర్సన్లుగా రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రమాణం చేశారు. ఉదయం 11.07 నిమిషాలకు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది.
ఆ తర్వాత వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్, జితిన్ రామ్ మాంఝీతోపాటు మిగిలిన కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12.02 నిమిషాల వరకు కేంద్ర మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
నేడు 264 మంది ప్రమాణం
లోక్‌సభలో 543 మంది సభ్యులుండగా తొలిరోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలు మొదటిరోజే ప్రమాణ స్వీకారం చేయగా, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా.. మిగతా వారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరగనుంది. అదేవిధంగా.. కేరళలోని వయనాడ్ లోక్‌సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 99కి తగ్గింది.
తొలిరోజే నిరసన సెగ
విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తొలిరోజే తమ ఐకమత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. లోక్‌సభలో తమకు కేటాయించిన చోట ముందు వరసలోనూ కూటమి పార్టీల నేతలు కూర్చున్నారు. తొలుత వారంతా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. రాజ్యాంగ ప్రతులను చేతబట్టుకుని, లోక్‌సభకు కలిసి వెళ్లారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సమయంలో రాహుల్‌గాంధీ సహా.. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను గాల్లోకి ఊపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకార సమయంలో.. ‘‘నీట్.. నెట్’’.. ‘‘నీట్ షేమ్’’ అంటూ నినాదాలు చేశారు.
నీట్ అక్రమాలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు.. ప్రొటెం స్పీకర్‌గా పార్లమెంట్‌కు ఎక్కువ సార్లు ఎన్నికైన వారికి అవకాశమివ్వాలి. అయితే.. సీనియర్ ఎంపీలున్నా.. బీజేపీ ఉద్దేశపూర్వకంగా భర్తృహరి మెహతాబ్‌ను నియమించడంపై ముందు నుంచి ఇండియా కూటమి అభ్యతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లో నియమితులైన కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్.. భర్తృహరి నియామకాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఇండియా కూటమి నేతలు ప్రొటెం స్పీకర్ నియామక తీరు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ నిరసన తెలిపారు. భర్తృహరి కంటే.. కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ సీనియర్ అని వివరించారు. దళితుడైనందువల్లే సురేశ్‌కు అవకాశమివ్వలేదని ఆరోపించారు.
విభిన్న భాషలు.. సంప్రదాయ దుస్తులు
లోక్‌సభ సభ్యులు ఇంగ్లి్‌షతోపాటు.. సంస్కృతం, హిందీ, డోగ్రీ, తెలుగు, బెంగాలీ, అస్సామీ, ఒడియా భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అన్నపూర్ణాదేవి, జ్యోతిరాధిత్య సింధియాలు హిందీలో.. రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి తెలుగులో, సురేశ్‌గోపీ మలయాళంలో, మురళీధర్ మహోల్ మరాఠీలో.. హెచ్‌డీ కుమారస్వామి కన్నడలో.. ఇలా వేర్వేరు భాషల్లో ప్రమాణం చేశారు. నటుడు, ఎంపీ రవికిషన్ ధోవతి, కుర్తాలో లోక్‌సభకు రాగా.. నటి కంగనా రనౌత్ తెల్ల చీరకట్టులో, మధ్యప్రదేశ్‌లోని రత్లాం నుంచి ఎన్నికైన అనితాచౌహాన్ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు.
రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం జరగనుంది. సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థికి ఉపాధ్యక్ష పదవి(డిప్యూటీ స్పీకర్) పదవి ఇవ్వాలనే ఆనవాయితీ కొనసాగుతోంది. అందుకే.. ఈ సారి ప్రతిపక్షాలకు ఇచ్చే ఉపసభాపతి పదవి తమకు ఇవ్వాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈనెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ జూలై 2న లోక్‌సభలో, 3న రాజ్యసభలో ప్రసంగిస్తారు.