Share News

PM Modi : సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా

ABN , Publish Date - Sep 01 , 2024 | 05:20 AM

మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు.

PM Modi : సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా

  • వారిపై జరిగే నేరాలపై విచారణ వేగంగా జరగాలి

  • ఇందుకు జిల్లా పర్యవేక్షణ కమిటీలు చురుగ్గా పనిచేయాలి: ప్రధాని మోదీ

  • జిల్లా న్యాయ వ్యవస్థను ‘దిగువ కోర్టులు’ అనొద్దు : జస్టిస్‌ చంద్రచూడ్‌

  • జిల్లా న్యాయ వ్యవస్థపై ఢిల్లీలో సదస్సు

న్యూఢిల్లీ, ఆగస్టు 31: మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు. కోల్‌కతాలో యువ వైద్యురాలిపై హత్యాచారం, మహారాష్ట్రలో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగికదాడి ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు.

మహిళలపై జరిగిన నేరాల కేసుల్లో విచారణ వేగవంతానికి జిల్లా జడ్జి, కలెక్టర్‌, ఎస్పీలతో కూడిన జిల్లా పర్యవేక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉందని చెప్పారు. క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలోని పలు అంశాలను సమన్వయ పరచడంలో ఈ కమిటీలకు ప్రధాన పాత్ర ఉందని తెలిపారు. ఈ కమిటీలు మరింత చురుగ్గా పనిచేయాల్సి ఉందని సూచించారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి చట్టాల్లో కఠినమైన నిబంధనలను పొందుపరిచామని, కేసుల సత్వర విచారణకు 2019లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల విధానాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు.


  • న్యాయవ్యవస్థపై అపనమ్మకం లేదు

రాజ్యాంగం, శాసనాల స్ఫూర్తిని కాపాడడంలో న్యాయవ్యవస్థది ముఖ్యమైన పాత్ర అని ప్రధాని ప్రశంసించారు. అందుకే సుప్రీంకోర్టుపైన, న్యాయవ్యవస్థపైనా దేశ ప్రజలు ఎప్పుడూ అపనమ్మకం చూపలేదని అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని చీకటి రోజులని అభివర్ణించారు. ఆ సమయంలో ప్రాథమిక హక్కులు కాపాడడంలో న్యాయవ్యవస్థ ప్రముఖంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాధనకు న్యాయ వ్యవస్థే బలమైన స్తంభమని మోదీ అన్నారు. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే పునాది అని అభివర్ణించారు. ‘‘న్యాయం కోసం పౌరులు తొలుత కింది కోర్టు తలుపు కొడుతారు.

న్యాయ ప్రక్రియకు మొదటి ప్రదేశం, తొలి అడుగు ఇదే’’ అని అన్నారు. న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్న సూచనలపై మోదీ స్పందిస్తూ న్యాయం అందుబాటులో ఉండే విధంగా గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు సర్వసిద్ధంగా ఉండే న్యాయ వ్యవస్థ రూపల్పన దిశగా ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టును నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టాంపును, స్మారక నాణేన్ని ఆవిష్కరించారు.


  • జిల్లా కోర్టులే న్యాయవ్యవస్థకు వెన్నెముక

ఈ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రసంగిస్తూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను కింది కోర్టులని పిలవడాన్ని మానేయాలని అన్నారు. అవి ఎవరి ఆధీనంలో పనిచేయడం లేదని, నిజానికి అవి న్యాయ వ్యవస్థకు వెన్నెముక లాంటివని చెప్పారు. చట్టబద్ధ పాలన అమలులో కీలక పాత్ర వాటిదేనని తెలిపారు. అందువల్ల బ్రిటిష్‌ కాలం నాటి దిగువ కోర్టులు (సబార్డినేట్‌ జ్యుడీషియరీ) అనే మాటను వాడకూడదని సూచించారు.

జడ్జీల ఆరోగ్య పరిస్థితిపైనా చర్చ జరగాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. జడ్జీలు వృత్తి నిపుణులే అయినప్పటికీ కేసులు పరంగా, ఇతరత్రా ఒత్తిళ్లకు గురవుతున్నారని, దాంతో వారి మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతోందని అన్నారు. కొంతకాలంగా జిల్లా న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య పెరుగుతుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేరళలో ఇటీవల జరిగిన న్యాయాధికారుల భర్తీలో 72% మంది మహిళలే ఉన్నారని అన్నారు. గతేడాది రాజస్థాన్‌లో జరిగిన భర్తీలో 58% మంది, ఢిల్లీలో 66%మంది మహిళలు ఉద్యోగాలు పొందారని తెలిపారు.

Updated Date - Sep 01 , 2024 | 05:21 AM