Share News

Uttar Pradesh: రాయ్‌బరేలీకే రాహుల్‌ సై!

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:53 AM

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్‌ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

Uttar Pradesh: రాయ్‌బరేలీకే రాహుల్‌ సై!

  • వయనాడ్‌ను వదులుకోవాలని నిర్ణయం.. అక్కడి నుంచి పోటీ చేయనున్న ప్రియాంక

  • క్లిష్ట పరిస్థితుల్లో నా వెంట నిలిచారు.. వయనాడ్‌ ప్రజలకు రాహుల్‌ కృతజ్ఞతలు

  • అక్కడ అన్న లేని లోటు లేకుండా చూస్తా: ప్రియాంక

  • కేరళను కాంగ్రెస్‌ రాజకీయ ఏటీఎంగా భావిస్తోంది: బీజేపీ

  • లోక్‌సభలో విపక్ష నేత పదవి తీసుకోవటానికి రాహుల్‌ విముఖం

  • కుమారి షెల్జా, గౌరవ్‌ గొగోయ్‌, మనీశ్‌ తివారీల్లో ఒకరికి ఆ చాన్స్‌

  • కాంగ్రెస్‌ రాజకీయ ఏటీఎంగా కేరళ :బీజేపీ

న్యూఢిల్లీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వయనాడ్‌ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. వయనాడ్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ పడనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. సోమవారం ఖర్గే నివాసంలో ఆయనతో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, ప్రియాంకాగాంధీ సమావేశమయ్యారు. రెండు స్థానాల్లో గెలిచిన ఎంపీలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని ఖాళీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. రాయ్‌బరేలీ, వయనాడ్‌లో రాహుల్‌ ఏ స్థానాన్ని నిలుపుకోవాలనే అంశంపై చర్చించారు.


అనంతరం ఖర్గే విలేకర్లతో మాట్లాడుతూ తరతరాలుగా నెహ్రు కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్నందువల్ల రాయబరేలీ నుంచే రాహుల్‌ ఎంపీగా కొనసాగాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. వయనాడ్‌ ప్రజలూ రాహుల్‌నే కోరుకుంటున్నప్పటికీ నిబంధనలు అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాడటానికి అవసరమైన శక్తిని వయనాడ్‌ ప్రజలు తనకు అందించారని, ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. రాయ్‌బరేలీ, వయనాడ్‌లతో తనకు భావోద్వేగపూరిత సంబంధం ఉందని, వాటిల్లో దేనిని ఎంచుకోవాలన్న నిర్ణయం సులభం కాలేదని వెల్లడించారు. రాహుల్‌ లేని లోటు లేకుండా తాను చూస్తానని వయనాడ్‌ ప్రజలకు ప్రియాంకగాంధీ హామీ ఇచ్చారు. కష్టపడి పని చేసి మంచి ప్రజాప్రతినిధి అనిపిచుకుంటానన్నారు. కాగా, వయనాడ్‌లో రాహుల్‌పై పోటీ చేసి ఓడిపోయిన కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్‌.. రాహుల్‌ వయనాడ్‌ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. కేరళను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ఏటీఎంగా భావిస్తోందన్నారు.


ప్రతిపక్ష నేత పదవికి విముఖం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవిని తీసుకోవటానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అంగీకరించటం లేదని ఆ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాహుల్‌ బదులుగా కాంగ్రెస్‌ పార్టీకే చెందిన కుమారి షెల్జా, గౌరవ్‌ గొగోయ్‌, మనీష్‌ తివారీల్లో ఒకరు ఆ బాధ్యతలు చేపట్టవచ్చని పేర్కొన్నాయి. ఈ పదవిలో ఉండే వ్యక్తికి కేంద్ర క్యాబినెట్‌ మంత్రి హోదాతోపాటు ప్రతిపక్షాలను సమన్వయపరచటంలో, అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కోవటంలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. దీంతో ఈసారి విపక్ష నేత పదవిని రాహుల్‌గాంధీ తీసుకోవచ్చని ప్రచారం జరిగింది. రాహుల్‌ విపక్షనేత బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ కూడా ఇటీవల ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే, రాహుల్‌ అందుకు అంగీకరించటం లేదని తాజా సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌ ఆ తర్వాత.. ఏ పదవీ తీసుకోవటానికి ఇష్టపడటం లేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


క్రైస్తవులారా.. క్షమించండి!

  • ‘ఎక్స్‌’ ఖాతాలో వివాదాస్పద

  • పోస్టుపై కాంగ్రెస్‌ అభ్యర్థన

తిరువనంతపురం, జూన్‌ 17: ‘‘క్రైస్తవులారా.. క్షమించండి!’’ అని కేరళ కాంగ్రెస్‌ పార్టీ క్రిస్టియన్లను బేషరతుగా క్షమాపణలు కోరింది. అంతేకాదు.. ‘‘మేం ఏ మతాన్నీ, ఏ ఆచారాన్నీ కించపరచం. మా పార్టీ సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టు మీ మనసులను గాయపరిచి, మిమ్మల్ని భావోద్వేగానికి, మానసిక అశాంతికి గురి చేసినందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. సదరు పోస్టును ఇప్పటికే తొలగించాం’’ అని తెలిపింది. ఇటీవల ఇటలీలో జీ-7 సదస్సులో ప్రధాని మోదీ పోప్‌ ఫ్రాన్సి్‌సతో భేటీ అయ్యారు. ఈ ఫొటోను కేరళ కాంగ్రెస్‌ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ.. ‘‘చివరకు.. పోప్‌కు దేవుడి(మోదీ)ని కలిసే అవకాశం దక్కింది’’ అంటూ వ్యంగ్యాస్త్రాన్ని జోడించింది. ఇది వివాదాస్పద మైంది. క్రైస్తవ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో కాంగ్రెస్‌ క్షమాపణలు తెలిపింది.

Updated Date - Jun 18 , 2024 | 04:53 AM