IND vs ENG: వైజాగ్ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ
ABN , Publish Date - Feb 03 , 2024 | 10:21 AM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.
వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. మరొక 21 బంతుల్లోనే మిగతా 21 పరుగులు చేసిన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. షోయబ్ బషీర్ వేసిన 102వ ఓవర్లో వరుసగా సిక్సు, ఫోర్ కొట్టిన జైస్వాల్ డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 18 ఫోర్లు, 7 సిక్సులతో 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీని ఫోర్‌తో పూర్తి చేసిన జైస్వాల్, సెంచరీని సిక్సుతో, 150 పరుగులను ఫోర్‌తో, డబుల్ సెంచరీని ఫోర్‌తో పూర్తి చేసుకోవడం గమనార్హం. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట అద్భుతంగా ఆడిన జైస్వాల్ ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న జైస్వాల్ ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌లో కెరీర్‌లో రెండో సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు. జైస్వాల్ విధ్వంసం ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.
కాగా 93 ఓవర్లపాటు సాగిన మొదటి రోజు ఆటలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 34, రజత్ పటీదార్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా వారంతా పెదగా పరుగులు చేయలేకపోయారు. శ్రేయాస్ అయ్యర్ 27, అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17, రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు.