Share News

Telanagana Formation Day: అమరుల ఆశయాల బాటలో..

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:34 AM

ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.

Telanagana Formation Day: అమరుల ఆశయాల బాటలో..

  • అందుకోసమే సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం

  • ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం

  • రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు

  • ‘జయ జయహే తెలంగాణ’ ఇక అధికారిక గీతం

  • జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం

  • కన్నతల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం

  • తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు

  • ప్రేమను పంచి, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం

  • మేం అధికారం చేపట్టేనాటికి 7 లక్షల కోట్ల అప్పులు

  • ఆదాయాన్ని పెంచి.. సంపదను ప్రజలకు పంచుతాం

  • గ్రీన్‌ తెలంగాణ-2050 ప్లాన్‌ రూపొందిస్తున్నాం

  • తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచి కావాలి

  • డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరిస్తాం

  • పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు

  • రైతును రాజు చేయడమే ప్రభుత్వం లక్ష్యం

  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవనశైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వమని స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పలు విభాగాల గౌరవ వందనం అనంతరం ‘జై తెలంగాణ’ అంటూ రేవంత్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దకాలం పూర్తయింది.


రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని, ఈ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ సహించదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ‘తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది’ అని దాశరథి అన్న మాటలను సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. కాళోజీ చెప్పినట్లుగా, ‘‘ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’’ అన్న మాటలు అక్షర సత్యాలన్నారు.


సంస్కృతే జాతికి అస్తిత్వం..

రాష్ట్ర సంపదను పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందని, రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. తాము ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూనే.. సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వమని, ఆ సంస్కృతిని కాపాడడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. వచ్చి పదేళ్లయినా.. రాష్ట్ర గీతం లేదని, ఉద్యమకాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన, సహజకవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. ఇక దావోస్‌ పర్యటనలో భాగంగా రూ.40 వేల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, ఇది పెట్టుబడుల ఆకర్షణలో రికార్డు అని వెల్లడించారు. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండాలని, ఆ తల్లిని చూస్తే కన్నతల్లి యాదిలోకి రావాలని రేవంత్‌ వ్యాఖ్యానించారు. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే.. తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలన్నారు.


తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి అని, ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలని అన్నారు. ఈ మేరకు తెలంగాణ తల్లి రూపం సిద్ధమవుతోందని ప్రకటించారు. ఇక చిహ్నం అంటే ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుందని, జాతి చరిత్ర మొత్తం చిహ్నంలో నిక్షిప్తమై ఉంటుందని చెప్పారు. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటమని, ఇవి రాష్ట్ర అధికారిక చిహ్నంలో ప్రతిబింబించాలని గుర్తు చేశారు. ఆ దిశగానే ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామన్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్లలో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా ‘టీజీ’ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉద్యమ సమయంలో ‘టీజీ’నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారని, యువత తమ గుండెలపై పచ్చబొట్లుగా వేయించుకున్నారని, వారి ఆకాంక్షల మేరకే ‘టీజీ’ని పునరుద్ధరించామని తెలిపారు.


మూసీ సుందరీకరణ

మూసీని సుందరీకరించి.. హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచుతామని సీఎం రేవంత్‌ ప్రకటించారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నామని, ఇందుకోసం ఇప్పటికే రూ.1000 కోట్లను కేటాయించామని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఈ పథకం మరో స్థాయికి తీసుకెళ్లుతుందన్నారు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం అనే మూడు కోణాలు ఈ పథకంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మెట్రో విస్తరణ ప్రణాళికలనూ ప్రకటించామన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట వినిపించకుండా సంకల్పం తీసుకున్నామని రేవంత్‌ చెప్పారు. డ్రగ్స్‌ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, ఇందుకోసం ‘టీ న్యాబ్‌’కు పూర్తి సహకారం, స్వేచ్ఛతోపాటు అవసరమైన నిధులను కూడా ఇస్తున్నామని వెల్లడించారు.


ఇది ప్రజాపాలన..

పాలన ప్రజల దగ్గరకు చేరాలన్నది తమ ఆలోచన అని సీఎం రేవంత్‌ అన్నారు. అధికారంలోకి రాగానే.. ఇందిరమ్మ గ్రామసభల ద్వారా అభయహస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించామని, మొత్తం కోటి 28 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో డూప్లికేట్‌ పోగా.. కోటి 9వేల దరఖాస్తులు తేలాయని వెల్లడించారు. వీటిని పరిష్కరించే ప్రక్రియ నడుస్తోందన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, 30 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చామని, మెగా డీఎస్సీ నిర్వహణకూ నోటిఫికేషన్‌ ఇవ్వడంతోపాటు ఉద్యోగ అర్హతకు వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పేదల సొంతింటి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకువెళ్తుందని రేవంత్‌ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ ఒక్క ఏడాదే రూ.22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున దాదాపు 4.50 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నామన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,135 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పా టుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌ అన్నారు. గతంలో రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ చేసిన చరిత్ర తమదేనని, ఆ ట్రాక్‌ రికార్డును కొనసాగిస్తామని తెలిపారు. ఆర్థిక సాయంలో భాగంగా 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లను జమ చేశామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించామని పేర్కొన్నారు. ఇక ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఎలాంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశామని తెలిపారు. ధరణి సమస్యలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు.


పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం..

పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని సీఎం రేవంత్‌ అన్నారు. భౌతిక విధ్వంసంతోపాటు తెలంగాణ మూల స్వభావమైన స్చేచ్ఛపై దాడి జరిగిందని తెలిపారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని, ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కూడా విధ్వంసానికి గురయ్యాయన్నారు. 2014 జూన్‌ 2నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరిందని, కానీ.. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత దక్కుతుందన్నారు. దశాబ్దకాలం అనేది ఒక మైలురాయి అని, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలమని చెప్పారు. తమ ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చామని రేవంత్‌ అన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను తెచ్చామని, తాము సేవకులం తప్ప.. పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామని అన్నారు. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి, మీడియాకు స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు, ప్రతిపక్షానికీ గౌరవం ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా తమ నిర్ణయాల్లోని లోటుపాట్లపైనా సమీక్షకు అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు.


ఉమ్మడి రాజధానికి కాలం చెల్లింది..

ఏపీ, తెలంగాణకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన గడువు ఆదివారంతో పూర్తయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ ముందు పలు సవాళ్లు ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో మన లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లయినా నీటి పంపకాలు జరగలేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుని, సాగునీటి ప్రణాళికలను సమర్థంగా అమలు చేసుకోవాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. అంతేకాకుండా ఏపీతో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు.


ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలి..

తెలంగాణ రాష్ట్రం.. ప్రపంచానికే ఒక దిక్సూచి కావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘‘తెలంగాణ విజయ పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒక నాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెల్లో.. ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో రైతుల ముఖాలు చిరునవ్వుతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేతపట్టుకుని పట్నం వచ్చిన యువత.. రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. ప్రపంచ నంబర్‌వన్‌ బ్రాండ్‌గా హైదరాబాద్‌ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్‌గా మార్చాలన్న తపన ఉంది. ఆ దిశగా నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోపాటు, రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలి’’ అని రేవంత్‌ అన్నారు. తమ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే మొత్తం తెలంగాణకు ‘గ్రీన్‌ తెలంగాణ-2050 మాస్టర్‌ ప్లాన్‌’ను తయారు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించబోతున్నట్టు ప్రకటించారు.


అందెశ్రీ భావోద్వేగం

‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటిస్తూ సీఎం.. రెండున్నర నిమిషాల నిడివిగల గీతాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. తాను రాసిన పాట.. దాదాపు పదేండ్ల తరువాత అధికారిక గీతంగా, జాతికి అంకితమైన వేళ.. కవి అందెశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. అందరూ ఆ గీతాన్ని వింటున్న సమయంలో.. ఆయన రెండు కళ్లు చెమర్చాయి. అదే సమయంలో ఆయన పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు.


అమరులకు సీఎం నివాళులు

ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం నాంపల్లి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబరాలు నగరంలో అంబరాన్నంటాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రే వంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు గౌరవవందనం స్వీకరించిన సీఎం ఉత్తమ సేవలందించిన పోలీసులకు పథకాలు అందజేశారు.


తల్లికి హోదా కావాలా?

తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకు.. సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ గడ్డతో ఆమెది పేగుబంధమని, అది రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ప్రదాత సోనియాగాంధీని ప్రత్యేక ప్రతినిధిగా ఆహ్వానిస్తే.. ఏ హోదాలో ఆమెను ఆహ్వానించారని కొంతమంది ప్రశ్నిస్తున్నారని తప్పుబట్టారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి అనుమతి అవసరమా? అని సీఎం ప్రశ్నించారు. మహాత్మాగాంధీ ఏ పదవిలో ఉన్నారని ఆయనను మనం జాతిపితగా గుర్తుంచుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియాగాంధీ, అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, అప్పటి ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ పాత్ర మరువలేనిదన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 06:00 AM