Share News

Harish Rao: హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా.. హరీష్‌రావు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:45 AM

హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలనను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Harish Rao: హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా.. హరీష్‌రావు హాట్ కామెంట్స్
Harish Rao

హైదరాబాద్: హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలనను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని హరీష్‌రావు (Harish Rao) ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(ఆదివారం) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆయనను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ చూస్తున్నారని హరీష్‌రావు ఫైర్ అయ్యారు.


రాజేశ్వర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే చెప్పండి.. ఆయనే కూల్చేస్తారని సవాల్ విసిరారు. పార్టీ మారటం లేదని పల్లాను రాజకీయంగా ఎదుర్కోలేక టార్గెట్ చేశారని మండిపడ్డారు. పల్లా కాలేజీలు ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్‌లో లేదని నీటి పారుదల, రెవెన్యూ శాఖ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అన్ని అనుమతులు ఉన్నా సీఎం రేవంత్ కావాలనే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని హరీష్‌రావు తెలిపారు.


అక్రమ నిర్మాణాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు విద్యాసంస్థలు, ఆస్పత్రులపై చూపొద్దని హితవు పలికారు. తమ పార్టీ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డివి తప్ప రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్, మెడిసిన్ కాలేజీల సీట్లు పెంచారని తెలిపారు.


తెలంగాణలో డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శలు చేశారు. కౌన్సిల్ చైర్మన్‌కు చికెన్ గున్యా వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అన్నదాతలపై రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండ్ వైఖరీ అని ఆరోపణలు చేశారు. రేవంత్ దేవుళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని హరీష్‌రావు విమర్శలు చేశారు.


విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. వాటి నుంచి దృష్టి మళ్లించడానికి హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. దేవుళ్లనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని ఆరోపించారు. వడ్డీలకు ఎక్కువ ఖర్చు అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటున్నారని తెలిపారు. ఆదాయం, జీతభత్యాలు, కడుతున్న వడ్డీ ఎంతనో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


మెడికల్ కాలేజ్‌ను కూల్చే కుట్ర చేస్తున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తన మెడికల్ కాలేజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూల్చే కుట్ర చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 25ఏళ్ల క్రితం తాము విద్యాసంస్థలు స్థాపించామని గుర్తుచేశారు. గత 8నెలలుగా వ్యక్తి గతంగా తన మీద, తన కుటుంబం మీద దాడి జరుగుతోందని విమర్శలు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడి తన మీద జరగలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.


నీటిపారుదల శాఖ తమకు ఎన్వోసీ ఇచ్చిందని.. అదే శాఖ తన మీద ఇప్పడు కేసు పెట్టిందని మండిపడ్డారు. తన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేశామని స్పష్టం చేశారు. చెరువు భూమి ఇంచు కూడా అక్రమించలేదని తేల్చిచెప్పారు. సర్వే చేసి కబ్జా చేసినట్లు నిరూపిస్తే కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పి అధికారులు నోటీస్ ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Aug 25 , 2024 | 12:24 PM