Harish Rao: రేవంత్.. నువ్వెన్ని బ్లాక్‌మెయిల్స్ చేసినా భయపడను.. హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:47 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నిస్తునే ఉంటానని హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని అన్నారు. అధికారం కోసం ప్రజలను మోసగించడం రేవంత్ నైజమని హరీష్‌రావు ఆరోపించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇవాళ(మంగళవారం) కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుతో పాటు మరికొన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా భయపడనని సీఎం రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్‌రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవుళ్లను సైతం దగా చేశావ్..
‘‘నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించావు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగంబజార్ పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించావు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు ఒకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించావు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించావు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను’’ అని హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నీ అన్యాయాలను నిలదీస్తా..
‘‘నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు’’ అని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే మోసం, దగా..
మోసం, దగా, వంచనకు రేవంత్‌రెడ్డి ఏడాది పాలనే నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అధికారం కోసం ప్రజలను మోసగించడం ఆయన నైజమని ఆరోపించారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతోనే కాంగ్రెస్ ఏడాది పాలన సాగిందని ధ్వజమెత్తారు. గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక, ఉన్న రైతుబంధునే ఇవ్వడం లేదని హరీశ్‌రావు విమర్శించారు.
చార్జిషీట్ పెడతా..
కౌలు రైతులకూ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఓవైపు చెబుతుండగా.. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం రైతు భరోసా డబ్బులపై రైతు, కౌలు రైతు మాట్లాడుకోవాలని చెబుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని అన్నారు. రేవంత్ అరాచక, బుకాయింపు పాలనపై తెలంగాణ ప్రజల ముందు చార్జిషీట్ పెడతానని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యం, మోసాలను ఈ నెల 7న ప్రజలకు పూర్తిస్థాయిలో వివరిస్తానని తెలిపారు. శిలా ఫలకాలపై సీఎం పేరు ఉండొద్దన్న రేవంత్.. ఇప్పుడు ఏకంగా ఫొటోనే వేయించుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్
MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..
Pushpa 2: పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News