Share News

Hyderabad: ఐకానిక్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:04 AM

తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్‌ టవర్‌గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్‌ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

Hyderabad: ఐకానిక్‌ టవర్‌గా తెలంగాణ భవన్‌..

  • రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్‌ టవర్‌గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్‌ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించి.. పటౌడీ హౌజ్‌లో ఐదున్నర ఎకరాలు, శబరి బ్లాక్‌ లో మూడున్నర ఎకరాలు తెలంగాణకు కేటాయించేలా ఒప్పించామన్నారు. బుధవారం, ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో ఇప్పుడున్న భవనాన్ని ఆంధ్రాభవన్‌గానే పిలుస్తున్నారని.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ఢిల్లీలో తెలంగాణకు భవన్‌ లేకపోవడం బాధకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ హౌజ్‌ పక్కన స్థలంలో గవర్నర్‌, సీఎం, మంత్రుల కోసం సూట్స్‌ నిర్మించనున్నట్లు తెలిపారు.


మంగళవారం దాదాపు రెండు గంటల పాటు.. తెలంగాణభవన్‌కు సంబంధించిన పలు డిజైన్లపై నిపుణులు ప్రజెంటేషన్‌ ఇచ్చారని కొమటిరెడ్డి వివరించారు. ఆడంబారాలు, రాజగోపురాల మాదిరిగా డిజైన్లు ఇస్తే వద్దని చెప్పి పలు మార్పులు చేయాల్సిందిగా సూచించానని పేర్కొన్నారు. తుది డిజైన్‌ను ఆమోదించాక హైదరాబాద్‌లో సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చి వారం రోజుల్లో డీపీఆర్‌ పూర్తి చేస్తామని చెప్పారు. కేవలం రెండు నెలల్లో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. మూడు నెలల్లో భవన్‌ నిర్మాణానికి ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ పొందేలా చూడాల్సిందిగా ఆర్‌ అండ్‌బీ అధికారులను ఆదేశించినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

Updated Date - Jun 27 , 2024 | 04:04 AM