Share News

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:30 AM

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్‌ రైళ్లు..

  • నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌, విశాఖ-దుర్గ్‌ మధ్య సేవలు.. సోమవారం ప్రారంభించనున్న ప్రధాని

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి 4 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ మధ్య నడుస్తుందని.. నాగ్‌పూర్‌ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌ చేరుకుంటుందని చెప్పారు. కాజీపేట, రామగుండం, బల్హార్షా, చంద్రాపూర్‌, సేవాగ్రామ్‌ ేస్టషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్‌ ఆగుతుందని వివరించారు.


విశాఖపట్నం-దుర్గ్‌ (ఛత్తీ్‌సగఢ్‌) మధ్య మరో వందే భారత్‌ రైలు సేవలు అందిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాయ్‌పూర్‌, మహాసముంద్‌, ఖరియార్‌ రోడ్‌, కాంతబంజి, తిత్లాగఢ్‌, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రెండు రైళ్లను ఈ నెల 16న అహ్మదాబాద్‌ నుంచి ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 10 వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తారని వివరించారు. వందేభారత్‌ రైళ్లపై సామాన్యులు మక్కువ చూపుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వందశాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉందని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌ నుంచి మొదలయ్యే వందే భారత్‌ రైలుకు సికింద్రాబాద్‌లో స్వాగతం పలకాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆహ్వానం పంపించారని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు వందే భారత్‌ రైళ్లను కేటాయించిన ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇప్పటివరకు నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు 8నుంచి 16 బోగీలతో ఉండగా.. సికింద్రాబాద్‌ - నాగ్‌పూర్‌ వందేభారత్‌ 20 బోగీలతో నడవనుంది.


  • విమోచన ఉత్సవానికి అతిథిగా కిషన్‌రెడ్డి

ఈ నెల 17న పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ రోజున కిషన్‌రెడ్డి.. జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరిస్తారు. గడచిన రెండు సార్లు కేంద్రం నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated Date - Sep 14 , 2024 | 04:30 AM