Share News

Deputy CM Bhatti: రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రితో సీఎం, మంత్రుల చర్చ

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:01 PM

రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈరోజు(బుధవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించారు.

Deputy CM Bhatti: రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రితో సీఎం, మంత్రుల చర్చ
Deputy CM Mallu Bhatti Vikramarka

ఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్డుపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన అంశాలను మీడియాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్‌వర్క్‌కు కావాల్సిన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

తెలంగాణలో రోడ్డు నెట్‌వర్క్ విస్తరణ పైన సుదీర్ఘంగా నితిన్ గడ్కరీతో చర్చించామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టే అంశంపై చర్చించామన్నారు. విజయవాడ రోడ్డును ఆరు లైన్లుగా మారుస్తామని ప్రకటించారు. హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డుపై చర్చించామన్నారు. వారం రోజుల్లో అన్ని శాఖలతో కలిపి మరో సమావేశం పెడతామని తెలిపారు. అన్ని శాఖల నుంచి ఒకేసారి క్లియరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


రీజనల్ రింగ్ రోడ్డుపై లోతుగా చర్చించామని.. వారు దానికి అంగీకరించారని వివరించారు. విజయవాడ - హైదరాబాద్ రోడ్డుకు టెండర్లను పిలిచేందుకు అంగీకరించారని చెప్పారు. హైదరాబాద్ - కల్వకుర్తి రోడ్లు, ఇతర రోడ్లపై చర్చ జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని నితిన్ గడ్కారీకి చెప్పామని అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కారీకి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.


రాజధానుల మధ్య ఆరు లైన్ల రోడ్డు: మంత్రి కోమటిరెడ్డి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ‌తో పలు విషయాలపై చర్చించామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్లు, భూ సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదని మండిపడ్డారు. హైదరాబాద్, అమరావతి రెండు రాజధానుల మధ్య ఆరు లైన్ల రోడ్డు నిర్మిస్తున్నామని ... రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌వే కూడా నిర్మిస్తామని చెప్పారు.

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాయి, రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. చాలా రోడ్ల సమస్యలపైన ఈరోజు క్లారిటీ వచ్చిందన్నారు. ఉప్పల్ ఘట్‌కేసర్ ఫ్లై ఓవర్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణ అభివృద్ధి మాత్రమే ముఖ్యమని.. తమ మధ్య ఎలాంటి రాజకీయాలు లేవని, అందరం బాగానే ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 05:13 PM