Share News

Maheshkumar Goud: అవినీతి చేసిన వారిపై చర్యలు.. మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 26 , 2024 | 06:55 PM

తెలంగాణపై పదేళ్లలో రూ.8లక్షల కోట్లను మాజీ సీఎం కేసీఆర్ అప్పు చేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో విడతాల వారిగా చేసిన దానికంటే తాము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువేనని స్పష్టం చేశారు.

Maheshkumar Goud: అవినీతి చేసిన వారిపై చర్యలు..   మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వారు చేసిన తప్పులకు కేసీఆర్, కేటీఆర్‌లను రెండు, మూడేళ్లుకాదని.. పదేళ్ల జైలు శిక్ష కూడా తక్కువేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. అంత వ్యయం ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చాలా తక్కువధరకే కరెంట్ దొరుకుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక వెసులుబాటు తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉంది, కానీ తెలంగాణపై పదేళ్లలో రూ.8లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేశారని విమర్శించారు. ఏ పథకాన్ని తమ ప్రభుత్వం ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విడతాల వారిగా చేసిన దానికంటే.. తమ ప్రభుత్వం రుణమాఫీ ఎక్కువ చేసిందని తేల్చిచెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం, పథకాలను ఎగ్గొట్టాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి అసలు లేదని స్పష్టం చేశారు. హైడ్రాలో ఒక్కటే పేదల ఇల్లు కూలిందని మహేష్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు.


సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం

‘‘సోషల్ మీడియాలో అనైతికంగా మా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. వారిని పట్టుకుందామంటే.. పట్టుకునే వీలు లేకుండా విదేశాల్లో ఉంటూ అకౌంట్లు నడుపుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో యథేచ్ఛగా చెరువుల కబ్జా జరిగింది. వయనాడులో జరిగిన విధ్వంసం తెలంగాణలో జరగకూడదనే యుద్ధప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేపట్టాం. విడతల వారిగానే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం.హైడ్రాతో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం. హైడ్రా, మూసీపై రివ్యూ చేస్తున్నాం. పేద, మధ్యతరగతి వారికి అన్యాయం కలగకుండా చర్యలు ఉంటాయి. అనుమతులు ఉన్నవాటిని వదిలేయాలి. మూసీలో మాత్రం స్వచ్ఛందంగానే కొందరు ముందుకు వచ్చారు. వారికి ఉపాధి కల్పన, మిగతా అంశాలపై మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో నెంబర్ 29పై ఎవరికి నష్టం జరగదని అధికారులు చెప్పారు. మెరిట్ లిస్ట్‌లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. జీవో నెంబర్ 29పై ఎవరు ఆందోళన చేశారో, ఎందుకు చేశారో తెలియడం లేదు’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు .


కేసీఆర్ ఎక్కడికి పోయారు...

‘‘తొమ్మిది నెలలుగా, ప్రతిపక్ష నేత ఎక్కడికి పోయారు. ప్రజల సమస్యలపై కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు. ఆయనకు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే చేస్తున్నది ఏంటి. సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఆయన ఇంటిని కూల్చమనే అధికారులకు చెప్పారు, కానీ కోర్టు డైరెక్షన్ వల్లే కూల్చలేదు. ప్రభుత్వానికి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చు, అదాని ఇచ్చారు అంతే. ప్రతిపక్షాల రాద్దాంతం చేయడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అంతే తప్ప భవిష్యత్ తరాల కోసమే హైడ్రా, మూసీ ప్రక్షాళన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండదు. ఫిరాయింపులపై కోర్టుదే తుది నిర్ణయం. చేరికల విషయంలో జీవన్ రెడ్డికి వివరించిన తర్వాతే కాంగ్రెస్ పార్టలో చేర్చుకున్నాం. జీవన్ రెడ్డికి మేము, పార్టీ అండగా ఉంటుంది.పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు స్థానికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు, వాటిని సర్దుబాటు చేసుకోని ముందుకు వెళ్తాం. బీఅర్ఎస్‌లో ఏముందని చేరతారు’’ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


బీఆర్ఎస్‌లో ఎందుకు చేరతారు...

‘‘కేసీఆర్ ప్రజలకు అసలు కనబడటం లేదు, ఎవరిని చూసి బీఆర్ఎస్‌లో చేరతారు. ఏ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం లేదు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు ఇలా అన్ని కేసుల విచారణ ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారం. కేంద్రాచట్టలు వర్తిస్తాయి. పార్టీ మెన్ అనే నాకు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా గాంధీ భవన్ ఉంటుంది. కేసీఆర్ చేసినట్లు మేము మోసం చేయమనే క్లారిటీతో ప్రజలున్నారు. 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం. డబ్బుల వెసులుబాటు లేకపోవడంతోనే కొంత ఆలస్యం జరుగుతుంది. పట్టురానిదే పథకాలు అమలు చేస్తున్నమా. మంత్రులకు స్వేచ్ఛ ఉంది’’ అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.


చేరికలు ఆగలేదు...

‘‘చేరికలు ఆగలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గలేదు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు ఉంది. కొత్త పాత కలయికతో పార్టీలో కొత్త ఇబ్బందులు వచ్చాయి, వాటిని సర్దుబాటు చేస్తున్నాం. పార్టీలో ఉన్న నేతలను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. కేటీఆర్‌తో సన్నిహితంగా ఇన్ అండ్ ఔట్ ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అధిష్ఠానం, సీఎం చేతుల్లో ఉంది. టెక్నీకల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే చేరినట్లు అధికారికంగా ప్రకటించడం లేదు’’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


కొండాసురేఖ అలా మాట్లాడాల్సింది కాదు..

‘‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొలిటికల్ బాంబ్‌లపై నేను ఎదురుచూస్తున్నా. కొండాసురేఖ వ్యక్తుల పేర్లు తీసుకోని మాట్లాడి ఉండకూడదు, సబబు కాదు. ఎప్పటిదో పాత ఆడియా క్లిప్ లీక్ చేశారు. ఆమెను ట్రోల్ చేసిన బాధలో, ఆక్రోశంలో ఆమె అలా మాట్లాడారు. 2029 ఎన్నికలు మాకు ఫైనల్. రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం. ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. తీన్మార్ మల్లన్న బీసీల విషయంలో కొంత డివియేట్ అవుతున్నారు, నేను దీపాదాస్ మున్షి మాట్లాడాం. అన్ని సర్దుకుంటాయి. నెలలో కమిటీలు వేస్తాం. బీసీ కులగణనపై నవంబర్‌లో సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాం. డిసెంబర్‌లో కొన్ని శుభవార్తలు వింటారు.’’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 07:48 PM