Hyderabadఫ నేటి నుంచి కేజీఎఫ్ సదస్సు ..
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:03 AM
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్‌ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హాజరుకానున్న 2వేల మంది ప్రతినిధులు
నాగార్జునసాగర్ నిర్మాణానికి ప్రధాన కారకుడైన ముక్త్యాల రాజావారి చరిత్రను వెలుగులోకి తెస్తాం
కమ్మగ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కుసుమ్‌కుమార్
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) తొలి సదస్సు ఇక్కడి హెచ్‌ఐసీసీలో శనివారం ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు. పెట్టుబడుల సేకరణకు సంబంధించి జరిగే చర్చలో మంత్రి శ్రీధర్‌బాబు.. ఆదివారంనాటి సదస్సులో వ్యవసాయంపై చర్చలో, ముగింపు కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొననున్నారు. దేశ, విదేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, ఇతర రంగాల్లో కమ్మ యువతకు ప్రోత్సాహం.. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గంవారి సమగ్ర సమాచార సేకరణ.. తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్ తెలిపారు.
ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన కమ్మ సామాజిక వర్గ నేతలకు ఈ సదస్సులో సన్మానం చేయబోతున్నట్లు వెల్లడించారు. అలాగే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరు, విద్యుత్తును అందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన కారకుడైన రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వరప్రసాద్ (ముక్త్యాల రాజావారు) చరిత్రను వెలుగులోకి తీసుకువస్తామని కుసుమ్ కుమార్ వివరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన ఆ రోజుల్లోనే (1954లో) రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చారని.. 5 వేల ఎకరాలు దానం చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేజీఎఫ్ ప్రతినిధుల సభ డిమాండ్ చేయబోతున్నట్లు తెలిపారు.