Share News

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:51 AM

సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.

G. Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరించం..

సింగరేణిలో రాష్ట్రం వాటా 51ు. కేంద్రం వాటా 49ు మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్ధం. కేసీఆర్‌ ఆడిన డ్రామా. గత పదేళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనినైనా ప్రైవేటీకరించామా? అలాంటప్పుడు సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామనడం పెద్ద జోక్‌’.

  • కేసీఆర్‌ అసత్య ప్రచారం చేశారు

  • ఆయన పదేళ్ల పాలనలో గనుల వేలాన్ని

  • వ్యతిరేకించడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం

  • రేవంత్‌ సర్కారు వేలాన్ని స్వాగతించింది

  • బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు

  • ఫోన్‌ ట్యాపింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణ

  • జరిపించాలి.. హరీశ్‌ ఫోన్‌నూ ట్యాప్‌ చేశారు

  • పార్టీ సారథ్యం ఈటలకు అప్పగిస్తే స్వాగతిస్తా

  • జగన్‌ నిర్లక్ష్యంతోనే పోలవరం జాప్యం.. ఐదేళ్లలో పూర్తి చేస్తాం

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు

  • ‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమమే ఎన్డీయే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీలోని తన కార్యాలయంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో బొగ్గు మాఫియాను రాబోయే ఐదేళ్లలో కూకటివేళ్లతో పెకిలించివేస్తామని తెలిపారు. ‘సింగరేణిలో రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రం వాటా 49 శాతం మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుంది?


సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్ధం. కేసీఆర్‌ ఆడిన డ్రామా. గత పదేళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనినైనా ప్రైవేటీకరణ చేశామా? అలాంటప్పుడు సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామనడం పెద్ద జోక్‌’ అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణిలో ఒకప్పుడు సుమారు 60 వేలమంది కార్మికులు ఉండేవారని, కానీ ఆ సంఖ్య ఇప్పుడు 39 వేలకు పడిపోయిందన్నారు. కేసీఆర్‌ తీరుతో సింగరేణి ఎంతో నష్టపోయిందన్నారు. ఉద్యోగాలను భర్తీ చేస్తే వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగులను తీసుకున్నారన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా వేల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్నిచోట్ల బొగ్గు నిల్వలు ఉన్నట్టు తెలిసిందని, వాటిని గుర్తించి వెలికితీస్తామన్నారు.


కేసీఆర్‌ తీరుతో తెలంగాణకు వేల కోట్ల నష్టం

కేసీఆర్‌ తీరువల్ల తెలంగాణ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ‘గనుల వేలం అనేది రాష్ట్రాలకే లాభం. కేంద్రానికి ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. గనుల వేలంతో ఒక్క ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికే సంవత్సరానికి సుమారు రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. తెలంగాణలో పదేళ్లు గనుల వేలాన్ని కేసీఆర్‌ అడ్డుకోవడం వల్ల ఎన్ని వేల కోట్లు నష్టం వాటిల్లి ఉంటుంది? అయితే, తెలంగాణలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గనుల వేలంపై ఆసక్తితో ఉంది. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో తొమ్మిది గనులకు వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఈ నెల 21న తెలంగాణ వేదికగా దేశంలోని 60 బొగ్గు బ్లాకుల వేలం పాట నిర్వహిస్తున్నాం. తొలిసారిగా తెలంగాణలో ఒక బొగ్గు బ్లాకు కోసం వేలం పాట నిర్వహించబోతున్నామ’ని కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో బొగ్గు బ్లాకులను తమకు ఇష్టం వచ్చిన నాయకులకు యథేచ్ఛగా కట్టబెట్టేవారని, దీని వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లేదన్నారు. ఇప్పుడు బహిరంగ వేలం పాట వల్ల ఎవరు ఎక్కువ మొత్తానికి పాట పాడితే వారికే అప్పగిస్తున్నామన్నారు.


బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదని ఇప్పటికే తెలిసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం నిబద్ధతతో ఉందని చెప్పారు. అందుకే కేంద్రం మూడు, నాలుగు కమిటీలు వేసిందని, అవన్నీ ఐరన్‌ ఓర్‌ నాణ్యంగా లేదని చెప్పాయని గుర్తు చేశారు. దేశంలో ఇప్పటికే అనేక కర్మాగారాలు మూతపడ్డాయని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించినా అదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను కేంద్రం కట్టడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి కడుతుందని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు. మరి ఆయన ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కుపై సమగ్ర నివేదిక కావాలని అడిగానని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తానని కిషన్‌ రెడ్డి తెలిపారు.


సీబీఐ లేదా హైకోర్టు జడ్జితో విచారణ

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది చాలా పెద్ద విషయమని, దీనిపై సీబీఐ లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం చేసిందే రాష్ట్ర పోలీసులు. మళ్లీ వారికే కేసు విచారణను అప్పగించడం ఏమిటి? దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎలా నమ్మాలి? చివరికి జడ్జిల ఫోన్లను కూడా వదల్లేదు. వ్యాపారవేత్తల ఫోన్లూ ట్యాప్‌ చేశారు. వాళ్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లు వసూలు చేశారు. హరీశ్‌రావు అంతా ఫేస్‌టైమ్‌లోనే ఫోన్లు మాట్లాడారు. ఆయన ఫోన్‌నూ ట్యాప్‌ చేశారనడానికి అదే నిదర్శనమ’ని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


నయీం ఆస్తులు ఏమయ్యాయి?

బీఆర్‌ఎస్‌ పాలనలో నయీం ఎన్‌కౌంటర్‌ జరిగిందని, ఆ తర్వాత అతని ఆస్తులు ఏమయ్యాయనే విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయని కిషన్‌ రెడ్డి తెలిపారు. ‘నయీం ఆస్తులు ఏమయ్యాయో చెప్పడం లేదు. చివరికి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ లెక్కలన్నీ బయటికి తీస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తే ఎన్నో నిజాలు బయటికి వస్తాయి. మేడిగడ్డ విషయంలో తాత్సారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. విద్యుత్‌ కుంభకోణం విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. పూర్తి నిజాలు బయటికి రావాలి. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి. బీఆర్‌ఎస్‌ కథ ముగిసిపోయింది. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ అవసరం లేదని ప్రజలు నిర్ణయించేశారు. పార్లమెంటు ఎన్నికల్లో దానిని ఖరారు చేసేశారు. భవిష్యత్తులో తెలంగాణలో మాకు కాంగ్రె్‌సతోనే పోటీ’ అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.


విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్లాంట్‌ రేపో ఎల్లుండో ప్రైవేటుపరం అవుతుందనేది అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. ఈ ఫైల్‌ ఇంకా ముందుకు కదల్లేదని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాపిటల్‌ మైన్స్‌ అవసరమని, దీని గురించి చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పోలవరం నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉందని, కానీ జగన్‌ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదన్నారు. ఎన్డీయే హయాంలో పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, ఆ నమ్మకాన్ని అక్కడి ఎన్డీయే ప్రభుత్వం నిలబెడుతుందని చెప్పారు.


‘సెల్యూట్‌ తెలంగాణ’ ర్యాలీ!

నేడు కిషన్‌రెడ్డి,

సంజయ్‌కు బీజేపీ శ్రేణుల స్వాగతం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు ‘సెల్యూట్‌ తెలంగాణ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేటలో ర్యాలీ ప్రారంభమై.. రసూల్‌పురా, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, వైఎంసీఏ, బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌, ఆబిడ్స్‌ సర్కిల్‌, నాంపల్లి రైల్వే స్టేషన్‌ మీదుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎం.రఘునందన్‌రావు, నగేశ్‌, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను కూడా సన్మానించనున్నారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


ఈటలను నియమిస్తే స్వాగతిస్తా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని గుర్తుచేశారు. కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమించినా మంచిదేనని చెప్పారు. ఈటల రాజేందర్‌ను నియమిస్తే స్వాగతిస్తానన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందే జమ్మూ కశ్మీర్‌ వెళ్లి ఎక్కువ సమయం అక్కడే ఉన్నానన్నారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అసాంఘిక శక్తులను ఎలా అడ్డుకోవాలి? అల్లర్లు జరగకుండా ఏం చేయాలి? వంటి అంశాలను తానే పర్యవేక్షించానని చెప్పారు.

Updated Date - Jun 20 , 2024 | 02:51 AM