Share News

Hyderabad: రుణమాఫీకి రాజముద్ర..

ABN , Publish Date - Jun 22 , 2024 | 02:56 AM

రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్‌-ఆ్‌ఫ-డేట్‌’గా నిర్ణయించింది.

Hyderabad: రుణమాఫీకి రాజముద్ర..

  • ఒకే విడతలో రూ.2 లక్షల మాఫీకి మంత్రివర్గ ఆమోదం

  • డిసెంబరు 9కి ఐదేళ్ల ముందున్న రుణాలన్నీ మాఫీ

  • నియమ నిబంధనలకు ఆమోదం.. త్వరలో జీవో

  • ప్రభుత్వంపై పడే భారం రూ.31 వేల కోట్లు

  • ‘రైతు భరోసా’ విధివిధానాలకు మంత్రివర్గ ఉపసంఘం

  • భట్టి, తుమ్మల, శ్రీధర్‌బాబు, పొంగులేటి సభ్యులు

  • వచ్చే 15 కల్లా నివేదిక, అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ

  • అర్హులైన, నిస్సహాయులైన ప్రతి ఒక్కరికీ వర్తింపు

  • అధికార ప్రతినిధులుగా శ్రీధర్‌బాబు, పొంగులేటి

  • ప్రభుత్వ సమాచారం వీళ్లిద్దరే ఇస్తారు: సీఎం రేవంత్‌

  • కేసీఆర్‌ పదేళ్ల రుణ మాఫీ రూ.28 వేల కోట్లేనని వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి, రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది. ఈ రుణాల మాఫీకి 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ‘కట్‌-ఆ్‌ఫ-డేట్‌’గా నిర్ణయించింది. ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది. రుణ మాఫీ పథకానికి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని క్యాబినెట్‌ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతుబంధు స్థానంలో తీసుకొస్తున్న రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం శ్రీమంతులకు, ఫామ్‌హౌజ్‌ ఓనర్లకు, జూబ్లీహిల్స్‌లో నివసించే వారికి కూడా అమలైందన్న విమర్శలున్న నేపథ్యంలో దీనిని సామాన్యులకు, నిస్సహాయులకు, అర్హులైనవారికి అందించాలని నిర్ణయించింది. విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది.

1 copy.jpg


సంఘంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలు సభ్యులుగా ఉంటారు. జూలై 15 లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రివర్గం ఆదేశించింది. నివేదికను శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు పెట్టి, సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ తర్వాతే పథకాన్ని ఆచరణలో పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని మీడియాకు వెల్లడించడానికి ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలను అధికార ప్రతినిధులుగా నియమించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటల నుంచి రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పంట రుణాల మాఫీ, రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాహుల్‌గాంధీ 2022 మే 6న వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. వ్యవసాయం అంటే దండగ కాదు... పండుగ చేయాలన్న పార్టీ ఆలోచన మేరకు మాఫీని చేపడుతున్నట్లు చెప్పారు.


సోనియా, రాహుల్‌, ఖర్గేలు మడమ తిప్పని నేతలని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004లో కరీంనగర్‌ గడ్డ మీద తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన సోనియాగాంధీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఆ క్రమంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్‌ ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ సోనియా తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. సోనియా లాంటి కమిటెడ్‌ నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ కూడా వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారని ప్రస్తావించారు. ఇది అలవికాని హామీ అని ఎంతమంది అన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను క్యాబినెట్‌ చర్చించిందని, వివిధ బ్యాంకులలో ఉన్న రుణ వివరాలను సేకరించి, క్రోడీకరించి, రుణ మాఫీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.


రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పదేళ్ల వ్యవధిలో రెండుసార్లు మాఫీ చేసినప్పటికీ మొత్తం 28 వేల కోట్లు మాత్రమేనన్నారు. తొలి విడత మాఫీలో రూ.16 వేల కోట్లు, మలి విడత మాఫీలో రూ.12 వేల కోట్ల రుణాలను రద్దు చేసిందని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్‌ చివరిసారిగా 2018 డిసెంబరు 11 వరకు కట్‌-ఆ్‌ఫ-డేట్‌ తీసుకుని రుణ మాఫీ చేసినందున తమ ప్రభుత్వం ఆ మర్నాటి నుంచి 2023 డిసెంబరు 9 వరకు కట్‌-ఆ్‌ఫ-డేట్‌గా తీసుకుంటోందని చెప్పారు. రుణ మాఫీకి రూ.31 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని, ఆ మేరకు నిధులు సేకరించి, తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. మొత్తం ఒకే దఫాగా రూ.2 లక్షల రుణమాఫీ జరిగిపోతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో, వడ్డీలు చెల్లిస్తామంటూ రకరకాల ప్రకటనలు చేసి, వాయిదాలపై వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. పలువురు రైతుల ఆత్మహత్యలకు కారణమైందని విమర్శించారు.


పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఎనిమిది నెలల్లోపే పంట రుణాల మాఫీ నిర్ణయాన్ని తీసుకుందని గుర్తు చేశారు. తాము అధికారానికి వచ్చిన తొలి ఆరు నెలల్లో రెండు నెలలు ఎన్నికల కోడ్‌తోనే గడిచి పోయిందని ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఒక సామాజిక బాధ్యతతో, చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రుణ మాఫీని కేబినెట్‌ ఆమోదించిన శుక్రవారం రోజు తన జీవితంలో చరిత్రాత్మకమైన రోజు అని ట్విటర్‌ వేదికగా కూడా రేవంత్‌ చెప్పారు.


‘రైతు భరోసా’కు

విధివిధానాలు

రైతు భరోసా పథకానికి విధివిధానాలను రూపొందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేసీఆర్‌ సర్కారు హయాంలో అనర్హులకు రైతు బంధు సొమ్ము ఇచ్చారని, జాతీయ రహదారులకు ఇచ్చారని, శ్రీమంతులకు, జూబ్లీహిల్స్‌లో నివసించే వారికి, ఫామ్‌హౌజ్‌లలో నివసించేవారికి ఇచ్చారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌజ్‌కు కూడా కేసీఆర్‌ రైతుబంధు సొమ్ము తీసుకున్నారనే విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చామని రేవంత్‌ తెలిపారు. పథకం పారదర్శకంగా ఉండాలని, భాగస్వాములందరితో చర్చించి, అందరి సూచనలు, సలహాల మేరకు నిస్సహాయులకు అందించాలని, ప్రభుత్వ సంక్షేమాన్ని సామాన్యులకు చేరవేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో సలహాలు, సూచనలు తీసుకుని రైతు భరోసాకు విధివిధానాలను పారదర్శకంగా తయారు చేస్తుందన్నారు. జూలై 15 లోపు నివేదిక వస్తుందని, వచ్చే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో పెట్టి, అందరు శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకుని, విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం ఆధారంగా పని చేయాలని తమ క్యాబినెట్‌ భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.


మంత్రులు రాజకీయాలు మాట్లాడొచ్చు

ప్రభుత్వ పాలనకు సంబంధించిన వివిధ రకాల సమాచారమివ్వడానికి, అపోహలను నివృత్తి చేయడానికి ఇద్దరు మంత్రులను అధికార ప్రతినిధులుగా నియమించాలని కేబినెట్‌ నిర్ణయించిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల సొంత మీడియాలో కొన్ని విషయాలను చిలవలు పలవలు చేసి, ప్రభుత్వంపై అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. మంత్రులను లేనిపోని విషయాలపై ఏదో ఒకటి మాట్లాడించి, దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. అందుకే, మంత్రివర్గ నిర్ణయాలతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను మీడియాకు బ్రీఫ్‌ చేయడానికి శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలకు బాధ్యత అప్పటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా, అపోహలు తలెత్తినప్పుడు ఇచ్చే వివరణలైనా... ఈ ఇద్దరు మంత్రులే ఇస్తారన్నారు.


వీరిచ్చేదే అధికారిక సమాచారమని రేవంత్‌ స్పష్టం చేశారు. మీడియా కూడా అనుమానాల నివృత్తికి వీళ్లిద్దరినే సంప్రదించాలని చెప్పారు. రాజకీయ అంశాలపై ఏ మంత్రి అయినా మాట్లాడతారని, ప్రభుత్వ పాలనకు సంబంధించిమాత్రం ఈ ఇద్దరు సమాచారం ఇస్తారని వివరించారు. రుణ మాఫీకి నిధులెలా అని విలేఖర్లు అడగ్గా, ‘‘తినబోతూ రుచులెందుకు... నలభీమ పాకం వండే భట్టి విక్రమార్కకు నిధుల విషయం తెలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేసి తీరతాం’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిధుల సమీకరణకు సంబంధించి లోతైన సమాచారం కావాలంటే ఆర్థిక మంత్రిని అడగాలన్నారు. రుణ మాఫీ ఏ ప్రాతిపదికన చేస్తామన్నది తమ అంతర్గత అంశమని చెప్పారు. అర్హులు, అనర్హుల గురించి విధివిధానాలు తయారవుతాయన్నారు. మాఫీ నియమ నిబంధనలను మంత్రివర్గం ఆమోదించిందని, త్వరలో జీవో వెలువడుతుందని రేవంత్‌ ప్రకటించారు. గడువులోగా చేయాలన్నదే తమ తాపత్రయమని, కేసీఆర్‌లాగా ఐదేళ్లలో చేయాలంటే ఇంత హడావుడి పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 22 , 2024 | 02:56 AM