Share News

CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి..

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:01 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్‌ హాజరు కానున్నారు.

 CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి..

  • వైఎస్సార్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం..

  • ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు

  • టీపీసీసీ చీఫ్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్‌

  • ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్‌, షర్మిల నివాళి

  • వైఎ్‌సఆర్‌ నిస్వార్థ ప్రజాసేవ చేశారు: సోనియాగాంధీ

  • ఆ మూడూ నా జీవితంలో మరువలేనివి: సీఎం

  • టీపీసీసీ చీఫ్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్‌

హైదరాబాద్‌/అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్‌ హాజరు కానున్నారు. వైఎ్‌సఆర్‌ కుమార్తె, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో.. వైఎ్‌సఆర్‌ అభిమానగణాన్ని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా వైఎ్‌సఆర్‌ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వైఎ్‌సఆర్‌ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజాభవన్‌లో, అటు గాంధీభవన్‌లో కార్యక్రమాలు తలపెట్టింది. ప్రజాభవన్‌లో వైఎ్‌సఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.


సోమవారం ఉదయం.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పంజగుట్టలోని వైఎ్‌సఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్‌కు వెళ్లి.. అక్కడ వైఎ్‌సఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత గాంధీభవన్‌కు చేరుకొని అక్కడ వైఎ్‌సఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్నీ సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి వైఎ్‌సఆర్‌ జయంతి వేడుకలు జరిగే మంగళగిరికి రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు. సీఎం రేవంత్‌ వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోపాటు పలువురు మంత్రలు, ముఖ్యనేతలు కూడా విజయవాడకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


ఏకకాలంలో జగన్‌, షర్మిల నివాళులు

వైఎ్‌సఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద సోమవారం ఉదయ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఏకకాలంలో నివాళులర్పించనున్నారు. ఇటీవల జగన్‌, షర్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాక ఇద్దరూ ఒకే సమయంలో ఇడుపులపాయలో వైఎస్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కానీ, ఈసారి ఇద్దరూ ఒకే సమయంలో నివాళులర్పించనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


13.jpg

వైఎ్‌సఆర్‌ జ్ఞాపకాలను స్మరించుకుంటాం: సోనియా

న్యూఢిల్లీ: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను తమ పార్టీ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. వైఎ్‌సఆర్‌ 75వ జయంతి సందర్భంగా ఆదివారం ఆమె ఒక లేఖ విడుదల చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒక మహోన్నత నాయకుడు. అద్భుతమైన ప్రతిభ, చైతన్యం, అంకితభావంతో దేశానికి, ఆంధప్రదేశ్‌ ప్రజలకు, కాంగ్రె్‌సకు నిస్వార్థంగా సేవ చేసిన నిజమైన దేశభక్తుడు’ అని ఆ లేఖలో సోనియా కొనియాడారు. వైఎస్‌ ప్రజాసేవ వారసత్వాన్ని ఆయన కుమార్తె వైఎస్‌ షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, అందుకు కృతజ్ఞతలని సోనియా పేర్కొన్నారు.


ఆ మూడూ మరువలేని ఘట్టాలు: రేవంత్‌

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, సోనియాగాంధీ సారథ్యంలో విజయభేరి సభ నిర్వహించడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. తన జీవితంలో మరువలేని సందర్భాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఆదివారంతో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఎక్స్‌’ వేదికగా రేవంత్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆదివారంతో మూడు వసంతాలు పూర్తయ్యాయని, ఆనాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన సోనియాగాంధీకి, పార్టీ అగ్రనేతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.


ఈ మూడేళ్లలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, సోనియా సారథ్యంలో విజయభేరి సభ నిర్వహణ, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం.. తన జీవితంలో మరువలేని ఘట్టాలన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్‌ నాయకులు, పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ప్రజా పాలనకు నాంది పలికిన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నానన్నారు. కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పదవీకాలం మూడేళ్లు పూర్తయినా.. కొత్త అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో మరికొంత కాలం సీఎం రేవంత్‌రెడ్డే టీపీసీసీ చీఫ్‌గానూ కొనసాగనున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 04:01 AM