Share News

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:31 AM

హైదరాబాద్‌లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.

Bonalu Festival: పట్నంలో బోనాల సందడి!

  • నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా హైదరాబాద్‌లో ఉత్సవాలు

  • గోల్కొండ జగదాంబ ఆలయంలో వేడుకలతో మొదలు

  • అక్కడ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కొండా సురేఖ

  • హాజరుకానున్న పొన్నం.. వేడుకలకు గవర్నర్‌ వచ్చే అవకాశం?

  • ఆలయ కమిటీలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సురేఖ

  • ఉత్సవాల ప్రచార పోస్టర్‌, కేలండర్‌, వీడియో సాంగ్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, నార్సింగ్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి. గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి ఆలయంలో ఆదివారం జరిగే వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా పలువురు నేతలు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ హాజరవుతారని భాగ్యనగర బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. అయితే దీనిపై రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. కాగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా ఆషాడ బోనాల వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.


శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బోనాల ఉత్సవాల ఆలయ కమిటీలకు ఆమె చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. నిరుటి కంటే ఘనంగా, అత్యంత వైభవోపేతంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.20కోట్ల నిధులు కేటాయించిందన్నారు. అనంతరం పొన్నం మాట్లాడారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక దేవాలయాల కమిటీలను భాగస్వామ్యం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం చేయడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు చక్కగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అ సందర్భంగా బోనాల వేడుకల ప్రచార సామగ్రి పోస్టర్‌ను ఆవిష్కరించారు. బోనాల జాతర కేలండర్‌, వీడియో సాంగ్‌, బోనాల చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మామిడి హరికృష్ణ రాసిన ’బోనాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌, దేవాదాయశాఖ, సమాచార శాఖ కమిషనర్‌ హన్మంతరావు, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ పాల్గొన్నారు.


ఈవీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వాహనాలు (ఈవీ), లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఈవీల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. శనివారం గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈటో ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాల సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పలు హామీ ఇవ్వడంతోపాటు సూచనలు చేశారు. ఏటా పది వేల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈటో ఆటో ఎలక్ట్రిక్‌ జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమను మరింత విస్తరించాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్నందున విదేశీ పెట్టుబడులను తీసుకురావాలన్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. మహిళా ఆటో డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఈటో చేపట్టిన కార్యక్రమాన్ని శ్రీధర్‌ బాబు ప్రశంసించారు.

Updated Date - Jul 07 , 2024 | 04:32 AM