KTR: ‘జనం నోటా ఒకటే స్లోగన్.. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’... కేటీఆర్ విమర్శలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:49 PM
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్: దద్దమ్మ పాలనలో ధర్నాలతో తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (BRS Working President KTR) విమర్శించారు. ఈమేరకు ఎక్స్(ట్విట్టర్)లో కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కుమొక్కు లేకుండా పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు.. గ్రామ సచివాలయం నుంచి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు.. రైతు నుంచి మొదలు రైస్ మిల్లర్ల వరకు.. కార్మికుని నుంచి మొదలు కాంట్రాక్టర్ల వరకు.. టీచర్ల నుంచి మొదలు పోలీస్ కుటుంబాల వరకు.. అవ్వాతాతల నుంచి మొదలు ఆడబిడ్డల వరకు.. విద్యార్థుల నుంచి మొదలు విద్యావంతుల వరకు.. నిరుద్యోగుల నుంచి మొదలు ఉద్యోగుల వరకు..కాంగ్రెస్ ప్రజాపతినిధుల నుంచి మొదలు ప్రతిపక్ష నాయకుల వరకు... ఒక్కరా ఇద్దరా.. ముగ్గురా మూలకున్నా ముసలవ్వ మొదలు బడిపిల్లల దాక ధర్నాలు నిరసనలు చేస్తున్నారని చెప్పారు. ‘‘జనం నోటా ఆడా ఇడా అంతటా ఒకేటే స్లోగన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’’ అని విమర్శించారు. ముందు దగా-వెనక దగా.. కుడి ఎడమల దగా .. దగా.. కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి బాంబులకు భయపడేది లేదు..
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని, త్వరలోనే బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి బాంబులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏం పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు. కేసులకు భయపడేది లేదు. మేం ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. దొంగ కేసులు పెడితే పెట్టుకో. నీ ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పు. చంద్రబాబు, వైస్సార్‌తోనే కొట్లాడినం.. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై మేం వచ్చాక లెక్క తెలుస్తాం. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తాం. చావుకు మేం భయపడం’’ అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో
Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే
Read Latest Telangana News And Telugu News