Share News

Minister Lokesh: ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 09:12 PM

ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని సూచించారు.

Minister Lokesh: ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
Minister Nara Lokesh

అమరావతి: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష ఈరోజు(బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో పలు కీలక విషయాలపై చర్చించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో చర్చించారు. దాదాపు 3గంటలపాటు అధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.


ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ వత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలనీ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని లోకేష్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను ఆరా తీశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

Updated Date - Jun 26 , 2024 | 09:12 PM