Share News

బోన్‌ సూప్‌లో బలం ఎంత?

ABN , Publish Date - Oct 06 , 2024 | 08:33 AM

ఎముకలు విరిగినప్పుడు అవి అతుక్కోవడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి బోన్‌ సూప్స్‌ కొంత ఉపయోగపడతాయి. బోన్‌ సూప్స్‌లో ప్రొటీన్స్‌, కాల్షియం లభిస్తాయి. వీటితో పాటు కొల్లాజెన్‌, హైల్యూరోనిక్‌ యాసిడ్‌, గ్లూకోసమీన్‌ మొదలైన పదార్థాలు కూడా బోన్‌ సూప్‌లో పుష్కలం.

బోన్‌ సూప్‌లో బలం ఎంత?

ప్రమాదాల్లో ఎముకలు విరిగినప్పుడు బోన్‌ సూప్స్‌ తాగితే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయంటారు, నిజమేనా? శాకాహారులకైతే బోన్‌ సూప్స్‌కు ప్రత్యామ్నాయం ఏమిటి?

- తరంగిణి, హైదరాబాద్‌

ఎముకలు విరిగినప్పుడు అవి అతుక్కోవడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి బోన్‌ సూప్స్‌ కొంత ఉపయోగపడతాయి. బోన్‌ సూప్స్‌లో ప్రొటీన్స్‌, కాల్షియం లభిస్తాయి. వీటితో పాటు కొల్లాజెన్‌, హైల్యూరోనిక్‌ యాసిడ్‌, గ్లూకోసమీన్‌ మొదలైన పదార్థాలు కూడా బోన్‌ సూప్‌లో పుష్కలం. ఇవన్నీ విరిగిన ఎముకలు తిరిగి అతుక్కునేందుకు సహాయపడతాయి. బోన్‌ సూప్‌ తీసుకోలేని వారు, శాకాహారులు ఆహారంలో కొన్ని రకాల పోషకాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి పూటా తీసుకొనే ఆహారంలో ప్రొటీన్‌ తప్పనిసరిగా ఉండాలి. ప్రొటీన్‌ కోసం మొలకెత్తిన గింజలు, పప్పు ధాన్యాలు, సొయా చిక్కుడు, అలసంద, రాజ్మా, సెనగలు లాంటి గింజలు, మీల్‌ మేకర్‌, సోయా పనీర్‌, పనీర్‌, పాలు, పెరుగు మొదలైన వాటిలో ఏవైనా చేర్చుకోవచ్చు. ఐరన్‌ అధికంగా ఉండే ఆకు కూరలను, గింజలను తీసుకోవడం వల్ల విరిగిన ఎముకకు రక్తసరఫరా సరిగ్గా జరిగి త్వరగా అతుక్కుంటుంది. క్యాల్షియం కోసం పాలు, పెరుగు, పనీర్‌, ఛీజ్‌ తీసుకోవచ్చు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ మధ్యన డయాబెటిక్‌ రైస్‌ లేదా లో జీఐ (ఔౌఠీ ఎఐ) రైస్‌ రకం మార్కెట్లో లభిస్తోంది. ఈ రైస్‌ తినడం వలన పిల్లల్లో ఎదుగుదల ఇబ్బందులేమైనా వస్తాయా?

- శ్రీకర్‌, ఆముదాలవలస

మామూలు బియ్యంలోనే కొన్ని రకాల జన్యు మార్పుల ద్వారా డయాబెటిక్‌ రైస్‌ను రూపొందించారు. మామూలు బియ్యం లానే ఈ రకంలో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. కానీ ఈ పిండి పదార్థాల రసాయనిక నిర్మాణంలో తేడాల వల్ల దీన్ని గ్లూకోజుగా మార్చి రక్తంలోకి సంగ్రహించే సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజును నియంత్రించేందుకు ఇది మంచి మార్గం. మామూలు తెల్ల బియ్యంతో వండిన అన్నం కంటే డయాబెటిక్‌ రైస్‌ తీసుకోవడం వల్ల బరువు పెరగరు అనేది అపోహ మాత్రమే. అవసరానికి మించి క్యాలరీలను ఏరూపంలో తీసుకొన్నా బరువు పెరుగు తారు. క్యాలరీలు, పోషకాల పరంగా మామూలు తెల్ల బియ్యానికి, డయాబెటిక్‌ రైస్‌ కు ఎక్కువ తేడాలు లేవు. అందుకే ఏ వయసువారైనా తినేందుకు డయాబెటిక్‌ రైస్‌ సురక్షితమైనదే. చిన్న పిల్లలు, వయోవృద్ధులు నిస్సం దేహంగా తెల్ల బియ్యానికి (వైట్‌ రైస్‌) ప్రత్యామ్నా యంగా వాడు కోవచ్చు. చిన్నపిల్లలకు ఈ అన్నం ఇవ్వడం వల్ల ఎదుగుదల లోపాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు.


ముప్ఫయి ఏళ్ళు పైబడిన మహిళలు క్యాల్షియం కోసం రోజూ పాలు తాగాలా? రోజూ పాలు తాగితే బరువు పెరుగుతారని విన్నాను, నిజమేనా? హెల్త్‌ మిక్స్‌ల వల్ల ఉపయోగం ఉందా?

- షమీమ్‌, అనంతపురం

మహిళలకు ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో అవసరం. పాలు, పాల పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకొంటే క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవచ్చు. పాలల్లో కేవలం క్యాల్షియం మాత్రమే కాదు, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, విటమిన్‌ ఎ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి కేవలం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు ఉపయోగపడతాయి. ఏవైనా కారణాల వల్ల పాలు తీసుకోలేని వారు పాల పదార్థాలైన పెరుగు, పనీర్‌ ద్వారా కూడా ఈ పోషకాలను పొందొచ్చు. కొంతమంది పాలల్లో చక్కర, తేనె, బెల్లం లాంటి తీపి పదార్థాలు, మార్కెట్లో లభించే హెల్త్‌ మిక్స్‌లు లాంటివి కలుపుకొని తాగేందుకు ఇష్టపడతారు.


mag5.2.jpg

తీపి పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకంటే క్యాలరీలు అధికం కాబట్టి పాలలో ఏమి చేర్చుకోకుండా తాగడం మేలు. ఇక హెల్త్‌మిక్స్‌ల విషయానికొస్తే వీటిలో కొన్ని విటమిన్లు, ఖనిజాలు లాంటి పోషకాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఈ పౌడర్లన్నింటిలోను పిండి పదార్థాలు, క్యాలరీలు అధికం. ఇవే పోషకాలు మనం తినే కాయగూరలు, ఆకుకూరలు, గింజలు, పండ్ల నుంచి కూడా లభిస్తాయి. వీటికోసం ప్రత్యేకమైన పౌడర్లు వాడాల్సిన అవసరం లేదు. రోజూ పాలు తాగితే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే. అవసరానికి మించి తీసుకొనే క్యాలరీలు ఏ రూపంలో తీసుకొన్నా బరువు పెరుగుతారు. పాలు, పాలపదార్థాలలో కొవ్వు తక్కువగా ఉండే టోన్డ్‌ రకాలను ఎంచుకొంటే మంచిది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Oct 06 , 2024 | 08:33 AM